“శ్రీవారిని దర్శించుకున్న (సినీ) ప్రముఖులు !!!” – శ్రీవారి ముందు ప్రముఖులెవరండీ అసలు?


తెలుగు న్యూస్ లో నాకు నచ్చని ఒకానొక (ఓకే ఒక కాదు) ఐటం ఇవాళ మళ్ళీ పేపర్లో పడింది. అది – “శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు (ఒకోసారి సినీ ప్రముఖులు)”. శ్రీవారి ముందు ప్రముఖులేంటండీ అసలు? పేపర్లవాళ్ళు అలా రాస్తారా ఈ ప్రముఖులు అలా రాయించుకుంటారా? ఫలానా దేవుణ్ణి దర్శించుకోడానికి వెళ్లాను అని నలుగురితో చెప్పుకోవటమే కూడదంటారు. అలా చెప్పుకుంటే దైవదర్శనం వల్ల మనలో ఏ మూలో వున్న కాస్తపాటి భక్తి, విశ్వాసం, దేవుడికి మన శరణాగతి, ఆ నమ్మకంవల్ల వచ్చే (లేక) రాబోయే జ్ఞానం – ఇలాంటి వాటి ఆరోగ్యానికి మంచిది కాదని అలా అంటారు. ప్రముఖులు అని పిలవబడుతున్నవాళ్లకి ఈ విషయం తెలీదు అనుకుంటే ప్రముఖులు అనే టైటిల్ సబబేనా?

శ్రీవారిని దర్శించుకునే రకరకాల ప్రముఖుల్లో సినీ, రాజకీయ, అధికారిక, ప్రభుత్వ ప్రముఖులే ప్రముఖులు. ఇందులో కొత్తగా చెప్పేదేంవుంది? ఏ తెలుగు పేపర్ చూసినా తెలుస్తుంది. కానీ కొత్తగా మనం చూడొచ్చు.

పైన చెప్పిన నాలుగురకాల ప్రముఖులకీ, ఇతర ఉత్తుత్తి ప్రముఖులకీ  తేడా ఏంటంటే అది కాంట్రవర్సీ. కుంభకోణం, రంభకోణం ఈ రెండు కోణాల్లో ఏ కోణంనుంచి చూసినా ఈ నలుగురూ అందులో చోటు చేసుకోవడానికి పోటీలు పడుతూ వుంటారు. అందువల్లే ప్రముఖులనే టైటిలూ దానికి టాగ్ లా భక్తి అంటే కొంచెం అదోలా అనిపిస్తుంది.

నవవిధభక్తుల్లో ప్రముఖభక్తి లేదు. ఇది దశమవిధ భక్తి. ఒక్క క్షణం, ఇప్పటి ప్రముఖ భక్తికన్నా చాలా రెట్లు అతిగా వుండే ప్రముఖ భక్తి , ఇన్ ఫాక్ట్, దశముఖ భక్తి రావణాసురుడు ప్రదర్శించి ఇరవై చేతులూ కైలాస పర్వతం కింద నలగ్గొట్టించుకుని శృంగభంగం అయ్యాక చివరికి పేగులతో(సొంతవి) రుద్రవీణ వాయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కలియుగప్రముఖులకి రావణుడంత భక్తీ లేదు, మొండితనమూ లేదు, సాహసం అంతకంటే లేదు. సో, ప్రస్తుత ప్రముఖభక్తి పదోరకం భక్తిలో లోయెస్ట్ లెవెల్.

భక్తికి సరిపోయే క్వాలిటీ హ్యుమిలిటీ(అణకువ, నమ్రత, వినయము) ప్రముఖత్వం కాదు. ఈ విషయం పేపర్లకి తెలియదా? దేవస్థాన అధికార్లకీ, అర్చకులకీ తెలియదా? ప్రముఖులకి తెలియదా? ఎవరికీ తెలియదా? అదే నాకు తెలియదు.

నిజాయితీగా చెప్పాలంటే ఈ టాపిక్ లేవనెత్తడంలో నాక్కొంత సెల్ఫ్ డౌట్ లేకపోలేదు. ప్రముఖులందర్నీ ఓకే గాటన కట్టడం కరెక్టు కాదేమో, నేనంత బ్రాడ్-మైండెడ్ కాదేమో! ముందే చెప్పినట్టు ప్రముఖులు అని రాయించుకుంటారా? పేపర్లే రాస్తాయా? అన్నమీమాంస ఒకటి వుందికదా!
అదీకాక భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానంగా అంబికా దర్బార్ బత్తీ తప్ప ఇంకెవరూ, ఏమీ వుండకూడదు, నేను కూడా. సో, నా ప్రశ్నల్ని జస్టిఫై చెయ్యడం ఎలా? వాట్నిఎవరాన్సర్ చేస్తారు? లాభం లేదు డైరెక్ట్ గా దేవుణ్నే ఆత్మారాముణ్ణే అడగాలి. అడిగేసాను ఈ ‘ప్రముఖ’ భక్తిని నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు అని. అం’తరంగా’లుగా ఆయనిచ్చిన సమాధానాలివీ –

రాకెట్ లాంచింగ్ ముందు ఇస్రో చైర్మన్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు అంటే ఏదో ఆయన వ్యక్తిగత నమ్మకం అని సరి పెట్టుకోవచ్చు. లాంచింగ్ ఫెయిల్ ఐతే అది దేవుడి ఫెయిల్యూర్ అని వాదించే వితండవాదులు ఇంకా తెరపైకి రాలేదు కనక ప్రస్తుతానికి వదిలెయ్యచ్చు. బట్, సినిమాల్లో సిగ్గూ లజ్జా లేని సీన్లు తీస్తూ, నటిస్తూ దేవుడికి పొర్లుదండాలు పెట్టే సినీ ప్రముఖుల్ని చూసి ఆ ‘సినీ’ భక్తిప్రపత్తులకి గుళ్ళో మూల విరాట్ మాయాబజార్లో ఎన్టీయార్ కృష్ణుడిలా తలపంకిస్తూ నవ్వుకుంటాడు. సామాన్యుల గుండెల్లో,బుర్రల్లో వుండే దేవుడు మాత్రం భ్రుకుటి ముడేస్తాడు. (భ్రుకుటి ముడెయ్యడం = frowning)

ఒక సుప్రీం కోర్టు జస్టిస్ తిరుపతో, శ్రీశైలమో వెళ్తే అదికూడా పర్సనల్ మేటర్ అని వదిలెయ్యచ్చు(వదిలెయ్యాలి) కానీ వేలకోట్ల కుంభకోణాలు చేసేసి కాలిబాటన కొండెక్కుతున్నా, కిరీటం తెస్తున్నా అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఫీలౌతాడు మనలోవుండే అంతర్యామి. గుళ్ళోవుండే సర్వాంతర్యామి మాత్రం, “నా దృష్టిలో అందరూ ఒకటే,” అన్న పాలిసీ పెట్టుకోవడంవల్ల అదే చిరునవ్వుతో, అదే అభయహస్తంతో ప్రోటోకాల్ ఫాలో ఔతాడు.

ఓ అయ్యేఎస్ వీఐపీ దర్శనం చేసుకుని వస్తే ఆయనకుండే డ్యూటీలు, పని+రాజకీయ వత్తిళ్ళూ తెలుసు కనక యాక్సెప్ట్ చేసేస్తాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కానీ ప్రజాసేవకులం అని ముఖాలమీద పోస్టర్లంటించుకు తిరిగేవాళ్ళు అందరితో క్యూలో నిలబడకుండా వీఐపీ దర్శనాలు చేసేసుకోవడం, వాళ్ళతో సాగదీసుకున్న మూతులతో అర్చకులు ఫోటోలు దిగడం… ఇలాంటివి చూస్తే ఆత్మారాముడికి నవ్వు, జాలి, చిరాకు ఒకసారే పుట్టుకొస్తాయి.

మరి మీడియా గురించేమంటావ్ స్వామీ అంటే అంతర్యామీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడూ ఇద్దరిదీ ఒకటే అభిప్రాయం. పూర్వం యుగాని కొకరో ఇద్దరో విలన్లు ఉన్నటైములో లోకకల్యాణానికై నారద మహర్షి నిర్వహించిన పాత్ర ని కలియుగంలో మీడియాకి హోల్-సేల్ గా ఔట్-సోర్స్ చేసేసార్ట. యుగధర్మం ప్రకారం లోకకళ్యాణం అనేపని లోకమంతా కాంట్రావర్సీమయంచెయ్యడంతో రిప్లేస్ ఐపోయిందిట. ఒకోసారి తెలిసీతెలియక కూడా మీడియా ఆ పాత్ర నిర్వహించేస్తూ ఉంటుందిట. ప్రస్తుత సబ్జెక్ట్ మాటర్ అలాంటిదేట.

మరి ఈ పరిస్థితిని మార్చే ఉద్దేశం నీకేమైనా వుందా స్వామీ అంటే – కురుక్షేత్ర యుద్ధం కానీ, వాగ్యుద్ధం కానీ ఆయుధం పట్టకూడదని పాలిసీట. అందులోనూ ఇది కలియుగం కనక అస్సలు కలగజేసుకోరుట. చట్టంలా తన పని తాను చేసుకుపోతూ కర్మసిద్ధాంతం ఉండనే ఉందిట. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెల్సుట, నాకే తెలీదుట. సో ఫ్రెండ్స్, అల్ మై డౌట్స్ క్లియర్డ్, అల్ మై క్వెశ్చన్స్ ఆన్సర్డ్. నో మోర్ కంప్లెయింట్స్ ఫ్రమ్ మై సైడ్!! 🙂 _/\_