మనిషి సాగరాకాశాల మధ్య నిలబడి వాటి సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి (అం’తరంగా’ల్లో విశ్వకవి భావాలు-3)


అన్ని ప్రశ్నలకీ అర్ధం తెలిసి జీవన పయనం మొదలుపెట్టినవాడే చెక్కుచెదరకుండా గమ్యం చేరతాడు. వాడే వెనకొచ్చే వారికి మార్గ సూచికలు ఏర్పాటు చేస్తాడు.

ADHAATHO

రామస్యాక్లిష్ట కర్మణః అని రాముడికి పేరు కలగడానికి తానెవరో తెలుసుకోవాలనే జిజ్ఞాసే కారణం .
అన్నీతెలుసుకునే పుట్టిన కృష్ణుడు ధర్మజ, అర్జునులకి అత్యంత క్లిష్ట సమయాల్లో మార్గ నిర్దేశం చెయ్యగలిగాడు.

అలెగ్జాండర్ దిమ్మదిరిగే సమాధానాలిచ్చిన దండికి ఆ ఆత్మవిశ్వాసం “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి” అన్న జ్ఞానంతో తాదాత్మ్యం చెందడం వల్లే కలిగింది.

అన్నీ వదులుకునైనా సత్యం తెలుసుకున్నాడు బుద్ధుడు.

తొణుకూ బెణుకూ లేకుండా సోక్రటీజ్ విషం త్రాగింది సత్యం విషయంలో రాజీ పడలేకే.
సత్యం అర్ధం చేసుకుని హృదయపూర్వకంగా నమ్మబట్టే గాంధీ నిర్భయంగా పరాయిపాలనని, పరాయి దేశంలోనూ ఎదిరించగలిగాడు.
రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు సత్యాన్ని శోదించి సాధించిన తీరే వారి అద్వైతనిష్ఠకి అద్భుతత్వాన్ని ఆపాదించింది.
స్వామి వివేకానంద అఖండ ఖ్యాతికి, దేశానికి ముద్దుబిడ్డ అవ్వడానికీ అతను పరమహంస శిష్యుడవటం కాదు ప్రధమ కారణం, అతనిలోని
తీవ్ర జిజ్ఞాస, తేలికగా సమాధానపడని తత్వాలకి పరమహంస తృప్తిపడటం.
లోకానికి దారిచూపించిన వారందరికీ ఆ స్థాయి కలగడానికి కారణం ప్రశ్నించే గుణం. యూనివర్సల్ యాక్సెప్టబిలిటీవున్న జవాబులు దొరికేవరకూ రాజీపడని తత్త్వం.
మరి ఇప్పటివరకూ తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని, విలక్షణత్వాన్ని ప్రశ్నించుకొని, పరిపక్వం చేసుకుంటూ వస్తున్న మానవ జాతికి ఇప్పుడేమయింది? ప్రశ్నించే శక్తి, ఆసక్తి తగ్గాయా?
కళల్లో, శాస్త్రజ్ఞానంలో ఆరితేరి అమరత్వాన్ని అందుకోగలనన్న ఆత్మవిశ్వాసానికి చేరువలో ఉన్న మనిషి ఎందుకిప్పుడు తనలో పెచ్చరిల్లుతున్నస్వార్ధాన్ని, మతమౌఢ్యాన్ని, పదార్ధవాదాన్ని, యుద్దాన్ని, మానసిక రుగ్మతలనీ, విపరీతత్వాన్ని ఆపుకోలేకపోతోంది?
ఎందుకు తనని తాను నిలదీసుకోలేకపోతోంది? ఎందుకలా నిస్సహాయంగా పలాయనవాదాన్ని ఆశ్రయిస్తోంది? తనని నీడని చూసి భయపడుతూ, నీడతోనే యుద్ధాలు చేస్తూ నేను గెలిచాను, నీడే ఓడటంలేదంటూ ఎందుకు ఆత్మవంచన చేసుకుంటోంది?

కోహం? ముక్తిః కఠమ్? కేన సంసార ప్రతిపన్నవాన్? అని తనని తాను నిలదీసుకోవడం మర్చిపోయిందా?
(లేక)
“అఖిల శాస్త్ర పురాణ తత్త్వాబ్ధు లీఁది
పరమ విజ్ఞానదీపమౌ పండితుండు
కాళరాత్రిని మార్గంబు గానలేక
యల్ల మామూలుకథఁ జెప్పి యంతరించు” ట వల్లనా?
(లేక)
“జీవితంబెల్ల బ హుశాస్త్ర సేవలందుఁ
గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యె;
నిప్పుడు వివేకనేత్రంబు విప్పిచూడఁ
దెలిసికొంటి నాకేమియుఁ తెలియదంచు” అనగల వినయాన్ని కోల్పోవటం వల్లనా?

మనిషి సాగరాకాశాల మధ్య నిలబడి వాటి సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. పూర్వం వేదకాలంలో విన్న పాఠాలు మరుపుకొచ్చాయి. మళ్ళీ వినాలి. ఇక్కడే అనిపిస్తుంది మనిషి జీవితం, ఆ మాటకొస్తే ఏ జీవిదైనా సరే, నిరంతరం సాగే క్షీరసాగర మధనం అని. తనలో తాను, బాహ్య ప్రపంచంతోనూ జరిపే నిత్య సంభాషణం, పరస్పర ప్రతిస్పందనం ఎన్ని తరాలు మారినా జరుగుతూనే ఉంటాయి. ఈ ఇంటరాక్షన్స్ మధ్య ఇంటర్వెల్స్ వచ్చినప్పుడు సంఘ జీవనం, సంస్కృతి, మొదలైనవి ఏర్పడతాయి.

(స’శేషం’)