ఉల్లిపాయల ధరలు, రైతుల ఆత్మ హత్యలు, నేరాలుఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకేనా ???


sasesham

“ప్రజలకి కలిగే అసౌకర్యాలకి, పడే బాధలకీ ప్రభుత్వాల, నాయకుల అసమర్ధత కారణం కాదు. పాలసీ, ప్లానింగ్ సరిగా లేకపోవటం కాదు. అంతటికీ మూలం వాస్తు,” అని నేతలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. “మేం చేసేదంతా చేసేస్తున్నాం కానీ రాష్ట్ర వాస్తు బావుండక ప్రజలు కష్టాలు పడుతున్నారు. పెట్రోలు, ఉల్లిపాయల ధరలు; రైతుల ఆత్మ హత్యలు, అత్యాచారాలు; నేరాలు ఘోరాలు, కుంభ కోణాలు అన్నీ వాస్తు సరిగా లేకే,” అని ఎవరో ఒక మంత్రి వర్యుడు త్వరలో అనకపోడు. “కేంద్రంనుంచి ప్రత్యేక పాకేజీలు రాకపోవడానికి వాస్తు దోషాలే కారణం,” అని కూడా తేల్చేయవచ్చు. జస్ట్ ఏ మాటర్ ఆఫ్ టైమ్. అసలు ప్రాబ్లెం రాష్ట్ర విభజన ముహూర్తంలో ఉందని కూడా అనుమానం. గులాం నబీ అజాద్ గారు ప్రత్యేక రాష్ట నిర్ణయానికి ఉగాది నుంచీ పోలాల అమావాస్య, అట్లతద్ది వరకూ రకరకాల ముహూర్తాలు కన్సిడర్ చెయ్యడం గుర్తుందా?

చీటికీ మాటికీ, అయినదానికీ, కానిదానికీ పిల్స్ వేసేవాళ్ళు ఇలాంటి అనవసరపు వ్యక్తిగత నమ్మకాల ఆధారంగా జరిగే వృధాఖర్చుల్ని ఆపమని ఓ పిల్ వేయ్యోచ్చుగా. వెయ్యరు. మూఢ నమ్మకాలు పెరిగిపోయాయని గోల చేసే మీడియా వాళ్ళేమో వాస్తులు, feng shui, వారఫలాలు అంటూ ప్రత్యేక పేజీలు పెడతారు. (ముందు మీడియా వాళ్ళందరి వాస్తులూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని అభిజ్ఞవర్గాల ఉవాచ)

నేతలు చేసే పనులూ, కుహనా పండితులు చెప్పే శాస్త్రాలూ చూసి డీప్ గా ఆలోచిస్తే రాష్ట్ర వాస్తు, నగర వాస్తు, ఇళ్ళ వాస్తులు సరిగ్గా లేకపోవటం నిజంగానే పెద్ద సమస్య కదా? ఇవన్నీ బాగు చేసేసినా, సపోజ్! ఫర్ సపోజ్ ! దేశం వాస్తు బావుండక యుద్ధాలు, తుఫాన్లు, సునామీలు రావచ్చు. పొరుగు దేశభూభాగాలు ఆక్రమిస్తే తప్ప దేశవాస్తు బావుపడదు. అదీ బావున్నా భూగోళానికి వాస్తు సరిగ్గా లేక మొదటికే మోసం రావచ్చు. భూమి తన అక్షానికి ఇరవై మూడున్నర డిగ్రీల యాంగిల్లో వంగి తిరుగుతూ ఉంటుంది. అదేకాక సూర్యుడి చుట్టూ తిరగే ఆర్బిట్ ఒకే ఫైన్ లైన్ గా ఉండదు. తడి ఇసుకలో సైకిల్ రౌండ్లు కొడితే టైర్ గుర్తులు ఎలా పడతాయి? అలా కొద్దిగా అటూ ఇటూగా ఉంటుంది భూ కక్ష్య. దానివల్ల ఎన్నో వాస్తు ఎఫెక్ట్స్ ఉండొచ్చు. వాస్తు పండితులు తమ దృష్టి ఇంకా అటు సారించలేదు. ముందుగా ఇళ్ళు, నగరాలు, రాష్ట్రాలు ఆపైన దేశాలు — వీటన్నిటి సమస్యలు తీర్చాక అప్పుడు దాని పని కూడా పట్టిస్తారు. (అయితే ప్రపంచాన్ని తుగ్లక్ పాలించడం మొదలుపెట్టే వరకూ ఆ అవసరం రాదని పరిశీలకుల అభిప్రాయం.)

సరే, ఫలానా వాస్తు మార్పు చేసేసినంత మాత్రాన లైఫ్ సెటిల్ ఐపోయిందనుకోడానికి లేదు. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వాస్తు మెయింటైన్ చెయ్యాలి. అదెలా అంటే …
ఇళ్ళ వాస్తు — ఇందుకు చేతిలో బాగా డబ్బుండాలి, మస్ట్. వాస్తు బావుంటే డబ్బోస్తుంది. డబ్బుంటే వాస్తు మార్చి ఇంకా సంపాయించొచ్చు. ఇంట్లోనూ, ఇంటి చుట్టూ చోటుండాలి. సామాన్లు అటూ ఇటూ అవసరాన్నిబట్టీ షిఫ్ట్ చెయ్యడానికి ఇది ముఖ్యం. ఇంటిచుట్టూ ఖాళీస్థలం ఉంటే ఈశాన్యం పెంచి, వాయవ్యం తగ్గించి…. లాంటి మార్పులతో మనం అనుకున్నవి సాధించొచ్చు. అలా కుదరకపోతే కొత్త స్థలం కొనుక్కోవాలి, కొత్తిల్లు కొనుక్కోవాలి.
నగర వాస్తు — ఇది చాలా కష్టమైన పనైనా చెయ్యవచ్చు. కాలవలు మళ్ళించడం, రోడ్ల అలైన్-మెంట్లు మారుస్తూ ఉండడం, క్రమబద్ధీకరణ పేరుతో బిల్డింగ్స్ కూలగొట్టించడం లాంటి మార్గాలు ఉన్నాయి.
రాష్ట్రవాస్తు — మార్చాలంటే బెస్ట్ మెథడ్ తెలుగు ప్రజలకి బాగా తెల్సిందే. రాష్ట్రాన్ని విడగొట్టేయ్యడమే.
దేశవాస్తు– మార్చడం అతి కష్టం. హిట్లర్, సద్దాం టైపు లీడర్లుంటే తప్ప. ఉన్న భూభాగాన్ని రక్షించుకోవడం ముఖ్యం. లేదా 1962 లో చైనాకి సమర్పించినట్టు కొంత సమర్పించి వాస్తు సర్దుబాట్లు చేసుకోవచ్చు. లేదా పాకిస్తాన్ పళ్ళూడగొట్టి బంగ్లాదేశ్ క్రియేట్ చేసినట్టు, అలాంటి పన్లూ చెయ్యొచ్చు.
గ్రహవాస్తు… ఇంపాజిబుల్, సో, మాట్లాడేది లేదు. ఏ గ్రహ శకలమో వచ్చిపడి భూకక్ష్య మార్చేస్తే, అప్పుడాలోచించొచ్చు మిగిలుంటే.

వాస్తు మార్పులపై ఒక అవగాహన ఏర్పడింది కదా! బేసిగ్గా పైన చెప్పిన అన్ని రకాల వాస్తులూ సరిగ్గా ఉన్నప్పుడే మనిషన్నవాడికి వాస్తు శాంతి జరుగుతుంది, విచ్ ఈజ్ ఇంపాజిబుల్. అందుకే భగవంతుడు రుద్రాక్షలనీ, ఉంగరాలకి రాళ్ళని, పుట్టు మచ్చలనీ … ఇంకా చాలా వాటిని ఏర్పాటు చేసాడని ‘కలి’ యుగపురుషులు చెప్తున్నారు.
వీటన్నిటిలోనూ అతిముఖ్యమైనవి రుద్రాక్షలు. రుద్రాక్షల్లో వంద రకాలు, ఒక్కొక్క రకం వాడితే ఒక్కొ ప్రయోజనం. అవన్నీ వివరించడానికి వంద ఛానల్స్ ఉన్నాయి. ఎక్కడో ఎవరో ఈ పాటికి రీసెర్చి చేస్తూ ఉండొచ్చు, రుద్రాక్ష జాతులన్నిటినీ క్లోన్ చేసేసి ఒకే చెట్టునుంచి అన్ని రకాల, అన్ని ముఖాల రుద్రాక్షలు కాసేలా చెయ్యడానికి. అది టైం పట్టే వ్యవహారం కనక దొరికిన రుద్రక్షకే చెక్కులు చెక్కి ఎన్ని ముఖాలు కావాలంటే అన్ని తయారుచేసుకోవచ్చు. రుద్రాక్ష చెట్లు ఈ పాటికి అంతరించే స్థితికి వచ్చి వుంటే చెక్క పూసలనే రుద్రాక్షలని చెప్పి అమ్మేయ్యచ్చు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం మనకి బాగా తెలిసిన టెక్నిక్కేగా. ఏదో ఓ రకంగా సంపాయించిన ఈ రుద్రాక్షలని వాస్తు, జాతక దోష నివారణలకి వాడుకోవచ్చు. కాకపొతే మొహానికి దట్టంగా పిండికట్లు పట్టించి, పెద్ద కుంకం బొట్టు, మెడనిండా హారాలు, రుద్రాక్షమాలలు ధరించి పయస్ గా మాట్లాడుతూ సరసమైన ధరకి ఆఫర్ చేసే వాళ్ళ దగ్గర కొంటే ఫలితాలు బావుండే అవకాశం ఉంది. ప్రొవైడెడ్, కొనే వాడి జాతకం బావుంటే.

That brings us to the topic of astrology. జ్యోతిష్యం – గ్రహ, రాశి, నక్షత్రాల గమనాల ఆధారంగా పనిచేసే శాఖ. జాతకం సరిగ్గా ఉండాలంటే మనిషి సరైన టైం చూసుకుని పుట్టాలి. అలా పుట్టాలంటే ఏం చెయ్యాలో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కొంచెం నాటీగా కూడా ఆలోచించాల్సొస్తుంది. జోక్కాదు, బర్త్ టైము కరెక్టు గా తెలిస్తే జ్యోతిష్యం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు ఒకరిద్దర్ని నేను చూసాను. ట్రిక్కంతా బర్త్ టైం నోట్ చెయ్యడంలో ఉంటుందని వాళ్ళంటారు. ఆ టైముకి వాడిన గడియారం, వాచీ సరిగ్గా పనిచేస్తూ ఉండాలి, వాటికి సెకండ్ల ముల్లో, డిస్ప్లేయో ఉండాలి. నోట్ చేసిన మనిషికి దృష్టి దోషాలుండకూడదు. టైము చూసిన వెంటనే కాయితమ్మీద సరిగ్గా రాయాలి. రాసే వాడికి డిస్లెక్సియా ఉందంటే ఇంకంతే. చూసే టైముకి కరెంట్ పోయిందంటే గోవిందా. ఇద్దరు వ్యక్తులు వేరు వేరు టైములు నోట్ చేస్తే కూడా ఇంకంతేనే. చెప్పొచ్చేదేంటంటే జ్యోతిష్యం ఎక్యురసీ ఆఫ్ టైమ్ బట్టీ కరెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. చెప్పేవాడు సబ్జెక్టున్నవాడవ్వాలి. ఇప్పుడదే సమస్య. శాస్త్రం తెలిసినవాడితో ఒక ఇబ్బంది ఉంది. ఫ్రాంక్ గా నీ ఖర్మ ఇలా ఉందీ అని చెప్తాడు. మనశ్శాంతి కోసం పూజలు, జపాలు చెప్తాడు. బ్రహ్మ రాత మార్చేయ్యాలని చూడడు. ఎందుకంటే వాడు బ్రహ్మని నమ్ముతాడు కనక. రాత మార్చేస్తామనే వాళ్ళంతా ఏ టైపో మరి వాళ్ళే చెప్పాలి. మనశ్శాంతి మటాష్ అయిపోయిన వాళ్ళని మార్కెట్ గా చూసే వాళ్ళే అంటే మనోభావాలు దెబ్బతింటాయేమో! మరి బ్రహ్మ రాతని డబ్బులు తీసుకుని మార్చేస్తే బ్రహ్మ మనోభావాలు దెబ్బతినవా? ఏమో బ్రహ్మ చెప్పడుగా. “బ్రహ్మ” కుహనా జ్యోతిష్కులకీ, వాస్తు/రుద్రాక్ష పండితులకీ “చెప్తాడు” మీరు వీటితో వ్యాపారం చేసి మీ రాతలు మార్చుకోండి, ఆ విషయం ప్రజలకి మాత్రం చెప్పకండీ అని. ఒకవేళ ఆయన చెప్పకపోయినా చెప్పాడనుకునే రాంగ్ నంబర్స్ ఉంటారు. ఐతే అది వాళ్ళ అదృష్టం, మన అదృష్టం. చెయ్యగలిగిందేం లేదు.

పై విధంగా నేతలు, ప్రజలు తమ తమ తలరాతలు మార్చుకుని ఒండొకరి తలరాతలు కూడా మార్చుకొనుట సాధ్యమని తేటతెల్లమగుచున్నది. ఐతే ఒక్క డౌటు గలదు, అదియేమన, అసలు పురాణపురుషులెవరూ మేనిప్యులేషన్ ఆఫ్ ఫేట్ యూజింగ్ వాస్తు, జాతక, రుద్రాక్ష టెక్నిక్స్ అనే టాపిక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు లేదు. ఈ యాంగిల్లో చూస్తే రాముడు, కృష్ణుడు, ధర్మరాజు వెర్రి మనుషులు; వసిష్టుడు, వ్యాసుడు, ధౌమ్యుడు వంటి మహర్షులకి వాస్తు, రుద్రాక్ష, ఎట్సెట్రా అస్సలు తెలీదు అనుకోవాల్సోస్తుంది. రాముడు, తన తమ్ముళ్ళు పుట్టింతర్వాత దశరధుడు జాతకాలు వేయించి, శాంతులు చేయించాడు. పంచవటి నిర్మాణంలో లక్ష్మణుడు వాస్తు పాటించాడు. అంతే వనవాసం ఆపి పట్టాభిషేకం జరగడానికి వాస్తు మార్పులు, సీతని వెతకడానికి అంజనాలు వేయించి, రావణున్ని చంపడానికి తాంత్రికపూజలు చెయ్యలేదు. వసిష్ట విశ్వామిత్రులు ఇలాంటివెం చెప్పకుండా సత్యాన్ని నమ్ముకో, ధర్మం ఆచరించు అనే చెప్పారు. రామాయణంలో ఒక్క కారెక్టర్ కీ లేటెస్ట్ ఫేట్ మేనిప్యులేషన్ టెక్నిక్స్ తెలీదని దీన్ని బట్టీ తెలుస్తోంది.

ఇంక కృష్ణుడి విషయానికొస్తే జరాసంధుడి ఓటమి, చావు మన చేతిలో లేదని ప్రాక్టికల్ గా రాజధాని మధుర నుంచి ద్వారకకి మార్చేసుకున్నాడుగానీ వాస్తువల్ల మార్చాడని ఎక్కడా ఉన్నట్టు లేదు. అదేంకాదు వాస్తు గురించే రాజధాని మార్చేశాడంటే ఆ మార్పు తరువాత ఆయన ఇంకా పెద్ద ప్రాబ్లెమ్స్ టాకిల్ చేసాడు. శమంతక మణి విషయంలో నీలాపనిందలు, పాండవులతో పాటు యుద్ధాలు, గాంధారి శాపం, యాదవ వంశానికి దుర్వాసుడి శాపం, ఎట్సెట్రా. వాస్తులు, రుద్రాక్షలు వాడి అవి తప్పించుకున్నట్టు లేదు. పైగా మహా శివభక్తుడు, అడిగితే శివుడు బ్రహ్మాండమైన రుద్రాక్ష ఇవ్వడా? అవతార పురుషుడు ఆయన మనకి ఎగ్జాంపుల్ చూపించడానికి వచ్చాడు, అందుకే ఆన్ని కష్టాలు
పడ్డాడు, ఆయనతో మనకి పోలికేంటి అనొద్దు. మనకి ఎగ్జాంపుల్ అని నమ్మితే ఆయన చెప్పినట్టు, చేసినట్టు చెయ్యడమే. ఎందుకు చెయ్యరు?

ధర్మరాజు వనవాసానికెళ్ళేముందు జాతకం ఎందుకు చూపించుకోలేదు? రెండోసారి జూదానికెళ్ళేముందు మయసభ వాస్తు ఎందుకు చూడలేదు?
కర్మ సిద్ధాంతం అర్ధం చేసుకున్నాడు కనక. మనం సరైన పనులు చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నవాడు కనక.

చివరికి తేలినదేమనగా, ప్రజలు తాము పురాణపురుషుల, ఋషుల చర్యలను ఫాలో అవ్వవలెనా లేక (కుహ)నాయకుల, పండితపుత్రుల చర్యలను ఫాలో కావలెనా తేల్చుకొనవలెను.

హిందువైనవాడు బ్రహ్మ, ధర్మ, కర్మ, జన్మ నాలుగూ నమ్మాలి. దేవుడిపై నమ్మకంతో ధర్మం ఆచరిస్తూ మంచి కర్మలు చేస్తే మంచి జన్మ(కులము కాదు, అది లేదు) వస్తుంది. ఇందులో షార్ట్ కట్స్ ఎక్కడున్నాయి? షార్ట్ కట్ ట్రై చేసినందుకేగా త్రిశంకువు తలకిందులుగా వ్రేలాడాల్సి వచ్చింది. వశిష్టుడి శాపం అనుభవించాల్సి వచ్చింది. వసిష్టుడు బ్రహ్మ రాతకి విలువిచ్చి తన ధర్మం తను నిర్వర్తించాడు. విశ్వామిత్రుడు తన అహంకారానికి విలువిచ్చి గిమ్మిక్స్ చేశాడు. అతన్ని నమ్మి త్రిశంకు ఇప్పుడు రూపం కూడా అసహ్యంగా మారిపోయి తలకిందులుగా వేళ్ళాడుతున్నాడు. పురాణాలు, శాస్త్రాలు నమ్మాలని, మేము నమ్ముతామని చెప్పేవాళ్ళకి వాటికి సరైన అర్ధం చెప్పి, అర్ధానికి తగినట్టు పాటించే బాధ్యత కూడా ఉంటుంది. నేతలు, శాస్త్రజ్ఞులు ఆ పని చేస్తున్నారా?

ఒకడి తలరాత మార్చే ప్రయత్నం చేసేటప్పుడు మార్పించుకునేవాడికి త్రిశంకువులాగ కొత్త రిస్కులేమీ ఉండవని, అనుకున్న ఫలితాలు ఫలానా టైములో వస్తాయని కొంత గారంటీ ఇవ్వాలి వాస్తు, రుద్రాక్ష శాస్త్రజ్ఞులు.
వాస్తు, ఎట్సెట్రాలతో ప్రజల, ప్రభుత్వాల సమస్యలు తీర్చదలుచుకునే నాయకులు ప్రచారం లేకుండా, ఎదుటివాణ్ని తిట్టకుండా, డబ్బులు, సారా పాకెట్లు పంచకుండా వాస్తు/రుద్రాక్ష/ స్టోన్స్ ఏదో ఒకటి కానీ, అన్నీ కానీ వాడి ఒక్క ఎలక్షన్ లో గెలిచి చూపించాలి. కావాలంటే కావలసినన్ని యాగాలు, హోమాలు చేసుకోవచ్చు.

ఇప్పటికీ వసిష్టుడిలాంటి పండితులు, ప్రవచనకర్తలు ఉన్నారు. విశ్వామిత్రుడిలా గిమ్మిక్స్ చేసేవాళ్ళూ ఉన్నారు. నేతల్లోనూ రెండు టైప్సూ ఉన్నారు. ఎవరిని ఫాలో అవ్వాలో సరిగ్గా చూసుకోకపొతే జనానికి త్రిశంకు స్వర్గమే గతి.

******