‘అ’ర్ణవం-‘ఆ’కాశం జీవానికి అఆలు నేర్పిన ఆదిగురువులు.
ఒక ప్రక్క అగాధమైన అర్ణవం మరోవైపు అనంతమైన ఆకాశం. ఆ రెండిటి మధ్య ఆలోచనా తరంగాలనీ, అమృతత్వాన్నిచ్చే జ్ఞానాన్ని తనలోనే ఇముడ్చుకున్న మేధస్సు.
అయస్కాంతపు విజాతి ధ్రువాల మధ్య తీగ వేగంగా కదిలినప్పుడు విద్యుత్తు ప్రవహిస్తే, మేధస్సు అంతుపట్టని విషయాల మధ్య అలుపులేని అన్వేషణ జరిపితే విజ్ఞానం వికసిస్తుంది.
యుగయుగాల ప్రస్థానంలో జీవికి అ ఆ లు నేర్పిన గురువులు అ ర్ణవం ఆ కాశం
ప్రళయజలధిలో ఏక కణజీవిగా ప్రప్రధమ ఆవిర్భావం, కోట్లాది సంవత్సరాల పరిణామం, అనేకానేక రూపంతరాలతో ఆగని బ్రతుకు ప్రయాణం తరువాత పంచ భూతాల వొడిలో అ ఆ లు దిద్దిన జీవం అసలు సిసలు బుద్ధిజీవిగా నరావతారం మొదలయ్యింది
రెండు కాళ్ళపై నిలబడడం నేర్చి కొన్ని లక్షలయేళ్ళే; నాగరికత నేర్చి కొన్ని వేలయేళ్ళే; ‘నేల విడిచి సాము’ చేసే నేర్పు కలిగి వందేళ్ళయినా కాలేదు
ఈ పరిణామానికంతటికీ ప్రత్యక్షసాక్షులుగా అగణ్యమైన అలలతో ప్రశ్నలు సంధిస్తూ సాగరం; అనంతమైన మౌనంతో స్పందించే అగమ్యమైన ఆకాశం. మనిషి భూమ్మీద శాశ్వతత్వం సంపాదించినా, మనిషిని మించిన మరో బుద్ధి జీవి ఆ స్థానాన్ని ఆక్రమించినా ఈ సాక్షులు అలాగే ఉంటాయి, తమని చూసి అచ్చెరువు పొందిన ఏ జీవికైనా అద్భుతాల అనుభవాలు కలిగిస్తూ.
ప్రకృతిలో అంతర్భాగంగా వచ్చిన మనిషి దాన్ని నియంత్రించినా, దానికి అతీతంగా ఎదిగినా దానికి మూలం అతని మస్తిష్కంలో చెలరేగిన ప్రశ్నలు, వాటికి ప్రకృతి ఆరాధనలో, పరిశీలనలో అతను పొందిన సమాధానాలే.
మనిషి మెదడులో చెలరేగిన భయం,కుతూహలం, ఆసక్తి, ఆర్తి, ఆశ, భావనాశక్తి, inquisitiveness, తార్కికప్రజ్ఞ, deductive logic.. వీటన్నిటినీ రెచ్చగొట్టి “ఇంతింతై వటుడింతై…” రీతిలో మనిషి ఎదుగుదలకి ప్రేరణనివ్వటానికా అన్నట్టు ఎన్ని యుగాలైనా ఆగని ప్రశ్నాపూరిత కెరటాలు;
ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని చెప్తూ అనంతమైన కాలాన్ని, అంతులేని దూరాన్ని మ్రింగేస్తూ ఆకాశం.
లోలోతుల్లోంచి ఏదో ఆరాటం, ఆవేశాలని కెరటాలే మాటలుగా పక్కనున్న తీరాన్ని, పైనున్న ఆకాశాన్నీకడలి కుదిపి కుదిపి ప్రశ్నిస్తోందా అనిపిస్తుంది.
వెల్తురు పరదా మాటున పగలంతా దాచిన తన నిజరూపాన్ని చూపుకి ఆనని ఊహకి అందని దూరాల్లో అంతరిక్ష అద్భుతాల్లో ఆవిష్కరించి మానవ మస్తిష్కంలో ప్రశ్నల అలల్ని ఉధృతం చేస్తుంది.
ఒమర్ ఖయాం కవికోకిల మాటలలో చెప్పినట్టు –
ఆదిమధ్యాంత రహితమై యలరుచుండు
కాలయవనిక భేదింపఁ గలమె మనము?
ఇటకు నెందుండివచ్చె నింకెటకుఁ బోవు
ప్రాణి యను ప్రశ్న కెవ్వాఁడు బదులు సెప్పు?
అని సత్యాన్వేషణ మొదలు పెట్టి,
ఎవ్వనిచే జనించు ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్
అని మూలకారణానికి శరణాగతి ప్రకటించి
ఆపైన “ఏకం సత్ విప్రాః బహుదా వదంతి“ దగ్గర ఆగి చివరికి “తత్వమసి“ తో కన్-క్లూడ్ చేసేవరకూ అంతరంగంలో అర్ణవాకాశ సంవాదం జరుగుతూనే ఉంటుంది.
ఐతే ఇదంతా మూలకారణానికి దానితో వ్యక్తికి(ఇండివిడ్యువల్) గల సంబంధానికి సంబంధించిన ప్రాసెస్ మాత్రమే. ఆకాశ, సముద్రాల మిస్టీరియస్ కమ్యూనికేషన్ ఒక్క ఆధ్యాత్మిక తలంలో మాత్రమేనా మనిషిని ప్రభావితం చేసేది? ఠాగూర్ సముద్రాన్ని గురించి చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
(స‘శేషం‘)