జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే


ఏకే నటించిన పీకే, పీకే నటించిన గోపాల గోపాల ఓకే వారంలో చూసేసాం. జీకే గా పీకే ఓకే పీకే గా ఏకే డబలోకే
రెండిట్లో థీమ్ ఒకటే, దేవుడికీ మనిషికీ మధ్య ఏర్పడ్డ దళారీ వ్యవస్థని ప్రశ్నించడం.
గోపాల గోపాలలో ప్రశ్నలన్నీటికీ మొదట్లోనే దేవుడి ఆమోద ముద్ర పడిపోతుంది. పీకేలో అసలు దేవుడు రంగంలో ప్రవేశించకుండా, ఆయన ఆస్తిత్వానికి భంగం రాకుండా డిబేట్ అంతా మనుషుల మధ్యే జరుగుతుంది.

పీకేలో ఇజాల ప్రిజాల్లో ఇరుక్కుపోయిన మైండ్స్ లో సమస్యలకి తాజా పరిష్కారాలు దొరకడం కష్టం అనే పాయింట్ ఎత్తి చూపిస్తూ గ్రహాంతర జీవిని ప్రవేశపెట్టారు. ఏ సమస్యనైనా అర్ధం చేసుకోవాలంటే ముందుగా దాని ప్రభావం నుంచి మనసు బయట పడాలి. ఫ్రీగా ఆలోచించాలి. అందులో నేనులేను అనుకుని ఒక పరిశీలకుడిగా వ్యవహరించాలి. అప్పుడే సమస్య డైమన్షన్స్ పూర్తిగా అర్ధం అవుతాయి. మూల కారణం తెలుస్తుంది. గ్రహాంతర జీవికి భూలోకవాసుల విశ్వాసాలు, లాజిక్కులు, పరిమితులూ, .. ఏవీ లేవు, తను ఏ చట్రంలోనూ ఇరుక్కోలేదు, ఏ ఛత్రంకిందో దూరి పబ్బం గడుపుకునే అలవాటు లేదు. ఫ్రెష్ గా ఆలోచించి నిజాయితీగా జవాబులు వెతుకుతాడు. అందరికీ చెప్తాడు.భూలోకవాసులతో పోలిస్తే కంప్లీట్ ఔట్-ఆఫ్-ది బాక్స్ థింకింగ్ చేస్తాడని చూపడానికి symbolicగా శరీరం మీద ఏ ఆఛ్ఛాదనా లేకుండా వదిలేసారు, (పాపం!)

అసలు దేవుడు మాత్రం తెరపైకి రాడు. దేవుడున్నాడా లేడా అనే మీమాంస ఎవరికీ కలగదు. రాంగ్ నంబర్, రైట్ నంబర్ల గురించి TV చర్చతోనే కధ ముగుస్తుంది. అయితే దేశం అంతా అట్టుడుకిపోతున్నారైట్ నంబర్ ఏమిటి, అసలది ఉందా, ఉంటే మన్ని పట్టించుకుంటుందా అని హేతువాదులూ, నాస్తికులూ టీవీ చర్చలు పెట్టి అరుచుకోరు, కొట్టుకోరు. అలాగే వివిధ మతాధిపతులు ఏది రైట్ నంబర్ అంటూ నిగ్రహాలు కోల్పోయి ఆగ్రహాలు ప్రదర్శించరు. అవి కూడా కొంచెం చూపెట్టాల్సింది. ఎటూ తేలని ఆ చర్చల వల్ల దేవుడు దిగివచ్చేలోపు ఎవరి సమస్య వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందేనన్న మెసేజ్ ఇంకా బలంగా జనంలోకి వెళ్ళేది. God helps those who help themselves అని నమ్మేలా.

గో.గో లో హీరో మైండ్ దేవుడి విషయంలో మొదటినుంచీ అన్.కండిషన్డ్ గానే ఉంది. సో, గ్రహాంతర మస్తిష్కం అవసరం లేకుండా తనే అన్ని ప్రశ్నలూ వేసి వాటికి జవాబులిచ్చేసాడు. దేవుడు అతని సిన్సియారిటీని మెచ్చినా తన వైపు తిప్పుకోడానికి యాక్ట్ ఆఫ్ గాడ్ తో షాకిచ్చి , తన సమస్యని (మనిషికి దేవుడు అర్ధం కాకపోవడం), మనిషి సమస్యని (దేవుడిపై నమ్మకం అంటే మానవత్వం నిలుపుకోవడం అని తెలుసుకోవడం) తీరుస్తాడు. తనకీ మనిషికీ మధ్య దళారులు అవసరం లేదనీ, లేరనీ హీరోకి నిరూపిస్తాడు. అలా నమ్మిన వాళ్లకి, సెపరేట్ గా తనని నమ్మకపోయినా మానవత్వాన్ని నమ్మి చేతల్లో చూపించినవాళ్ళకి తన సహాయం ఉంటుందని అనిపించేలా చేస్తాడు.
పీకేలో లాగే గో.గో లో కూడా అసలు దేవుడి ఉనికిపై చర్చ ఉండదు. దేవుడు సినిమాలోనే ఉన్నాడని మనకి తెలిసినా అందులో పాత్రలకి తెలీదు కదా. మరి ఆయన మీద చర్చ లేకపోతే ఎలా? ఆ చర్చలు పెడితే సినిమాకి కంటెంట్ కోసం కాక పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే వచ్చే మూర్ఖాభిమానుల మెదళ్ళు అనవసర శ్రమ పడతాయనేమో దర్శకుడు వాటి జోలికి పోలేదు.
పీకే తన స్వ’గ్రహం’లో దేవుడి గురించిన కాన్సెప్ట్స్ లేనట్టుగానే వ్యవహరిస్తాడు. మైండ్స్ ఫ్రెష్ గా, అన్-కండిషన్డ్-గా ఉండే, సహజంగానే సమదృష్టి, నిజాయితీ కలిగిన జాతినుంచి వచ్చినవాడు అయ్యుంటాడు. అందరూ అలాగే ఉన్న లోకంలో ఆత్మ నుంచి పరమాత్మ వేరు పడి అవతారాలెత్తాల్సిన అవసరం ఉండదు కదా. గో.గో. లో చెప్పినట్టు ప్రతీ మనిషి తనలోనే ఉన్న దేవుణ్ణి గుర్తించి, తన చేతల్లో వ్యక్తీకరిస్తే –
దేవుళ్ళూ-అవతారాలు, గురువులు-మతాలూ-వాటికి పెద్దలు, గ్రంధాలూ-వాటికి రకరకాల భాష్యాలూ, వ్యాఖ్యానాలు అవసరం ఉండదు.
ఒకవేళ ఉన్నా వాటి వల్ల స్పర్ధలు, వివాదాలు, మతమార్పిళ్ళు, మైనారిటీలు, రాజకీయాలు, విద్వేషాలు, వ్యాపారాలు, తీవ్రవాదాలు … ఏవీ ఉండవు
గడ్డాలు, తలపాగాలు, నామాలు, ఫత్వాలు.., ఫట్!
తాయెత్తులు, రుద్రాక్షలు, జాతకాలు, శకునాలు, పుట్టుమచ్చల శాస్త్రాలు…, మటాష్!
వీటన్నిటికీ భక్తి పేరిట ప్రచారం కల్పించే టీవీ ఛానల్స్…, హుష్!హుష్!

ఆధ్యాత్మిక రంగంలో దాన్ని భ్రష్టుపట్టించే దళారీలే కాక మానవత్వం కాపాడే మంచి గురువులూ ఉన్నట్టు గో.గో లో చూపిస్తే, పీకే ఆ పార్టేకాదు అసలు పూర్తిగా దేవుణ్ణి టచ్ చెయ్యకుండా వదిలేసాడు. మొత్తం మీద రెండూ ఆలోచనలు రేకెత్తించాయి. మానవత్వాన్ని గాఢంగా టచ్ చేసాయి. మూఢత్వాన్ని ఎండగట్టాయి. బాబాడమ్ ని బెంబేలెత్తించాయి.ఐతే, లౌకిక వాంఛలేవీ లేకుండా నిజమైన అసలైన దేవుడికోసం, రైట్ నంబర్ కోసం మాత్రమే అన్ని మతాల ఆధ్యాత్మిక దళారీల చుట్టూ తిరుగుతున్న సిన్సియర్ బట్ ఇన్నోసెంట్ భక్తులున్నారు. మూఢాంధులై ఆత్మబలిదానాలు, హత్యాకాండలు చేసే ఉగ్రవాదులూ ఉన్నారు. దేవుడు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తాడా, వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకురాడా అనే ప్రశ్న కూడా ఉంది. దేవుడు పట్టించుకోడు అంటే ఫత్వాలూ, కమండలంలోని నీళ్ళు జల్లి శాపాలిచ్చేవాళ్ళూ మేమున్నాం అంటూ రెడీ అయిపోతారు. అందువల్ల ఆ టాపిక్ చర్చించకుండా రెండూ వదిలేసాయి. ఐనా ఆ పని అంత వీజీ కాదని తెలుసు. కానీ కనీసం ప్రశ్నలు లేవనెత్తి ఉంటే బావుండేది. పవన్ కళ్యాణ్ పై మూఢ భక్తితో సినిమాకి వచ్చి ఈలలేసి గోల గోల చేసే వాళ్ళని పవన్ చూస్తే మాత్రం వాతలు పెడతాడనిపిస్తుంది.

చివరగా ఇతర మతాల్ని వదిలేసి హిందువులనే ఎక్కువగా టార్గెట్ చేశాయనే విమర్శ అవసరం లేదేమో. ఇతర మతాల్లో ఉన్న రాంగ్ నెంబర్ల కన్నా మన దాంట్లో ఎక్కువ రాంగ్ నెంబర్స్ ఉండే అవకాశం తద్వారా అన్ని రెట్లు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటాయి. అంతేకాదు. ఇతర మతాల్లో రాంగ్ నెంబర్ని పట్టుకోవడం ఈజీ. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ తీవ్రవాదుల కేటగిరీలో ఉంటారు. ఏదో విధంగా డ్రోన్స్ వాడైనా లీగల్ గా లేపెయ్యోచ్చు. ఇక్కడలా కాదు చాప కింద నీరులాగా వివిధ సిద్ధాంతాల ముసుగులేసుకుని ప్రజల బలహీనతలతో ఆడుకుని, వాళ్ళని పూర్తిగా నిర్వీర్యుల్ని చేసేస్తున్నారు. చంద్రశేఖరేంద్ర, అరవింద, వివేకానంద, రమణ మహర్షి వంటి గురుత్వం ఉంటే కాదనేవారెవరు? కుహనా గురువులతో, వాళ్ళని నమ్మే మూఢమనస్తత్వాలతో, వోట్ బాంక్ పాలిటిక్స్ తోనే హిందూ ధర్మానికి ప్రాబ్లెమ్. ఆ కోణంలో చూస్తే ఈ సినిమాలు హిందూధర్మానికి మూలస్తంభాలైన తార్కికత, తాత్వికత, నిష్కామకర్మలని హైలైట్ చేసాయనుకోవచ్చు.