ఆరు నెలలు తీరని కలలు, విగ్రహరాజకీయాలు మరియు On what item girls should be called.


మొన్న ఈనాడులో ఆరు నెలలు తీరని కలలు టైటిల్ తో వచ్చిన వార్త – “ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మంగళవారానికి ఆరునెలలయింది. విభజన చట్టంలో ఎపీకిచ్చిన హామీల అమలును గుర్తు చేసుకొనే ప్రతి ఒక్కరి నుంచి నిట్టూర్పే వినిపిస్తోంది….” – ఇలా సాగిన కధనం చివరికి విభజన బిల్లు ఆమోద సమయంలో రాజ్య సభలో మన్మోహన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ముగిసింది. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడలేదు కానీ హామీలు నెరవేర్చడంలో తాత్సారం గురించి సణుగుడు ఉంది. ఈ సణుగుడు తీవ్ర విమర్శగా మారుతుందా లేదా అనేది ఎనీబడీస్ గెస్.

ఈ మధ్య అమిత్ షా రెడిఫ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది వింటే, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే అలవాటు మనకుంటే ఆలారం బెల్స్ మోగుతాయి. “మా పార్టీని బలోపేతం చెయ్యడమే మా అజెండా. ఎక్కడెక్కడ పార్టీకి బలం తక్కువగా వుందో అక్కడ దాన్ని పటిష్టం చేస్తాం అంటే కానీ ఇతర పార్టీలకి వ్యతిరేకంగా పనిచేసే నెగెటివ్ అజెండా మాకు లేదు,” అన్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్ల ప్రచారంలో మోడీ, “సంకీర్ణ ప్రభుత్వాలకి కాలం చెల్లింది,” అన్నాడు. అన్నీ కలిపి చూస్తే బీజేపీ ప్రాంతీయ పార్టీలకి ఓ మెసేజ్ ఇచ్చినట్టే ఉంది. నేనే ఒక ప్రాంతీయ పార్టీ అధినేతనైతే అమిత్, మోడీల మాటలు నెగెటివ్ సెన్స్ లోనే అర్ధం చేసుకుంటా. పైకి చెప్పను కానీ నా జాగ్రత్తలో నేనుంటా.

ఇప్పుడే వచ్చిన వార్త –

బీజేపీ, టీడీపీలది విడదీయరాని బంధం. టీడీపీని బలహీన పరిచే ఉద్దేశం మాకులేదు. ఏపీ వ్యవహారాలు అమిత్ షా కి అప్పగించడం వెంకయ్య నాయుడు పై నమ్మకం లేక కాదు. అదంతా కాంగ్రెస్ ఊహా గానం – ఇది ఏపీలో బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉవాచ.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని కదా ట్రెడిషనల్ విజ్డమ్. దానికనుగుణంగానే నడుస్తాయి పార్టీని పటిష్టం చేసే చర్యలు. శత్రువులు మిత్రులెప్పుడవ్వాలి? మిత్రులు శత్రువులెప్పుడవ్వాలి? వీటికి ముక్కుసూటి సమాధానం ఉండదు, ఎప్పటికప్పుడు పార్టీ అధికారం అందుకోడానికి సిద్ధంగా ఉండేలా ప్రిపేర్ చెయ్యడమే పార్టీని పటిష్టం చెయ్యడమంటే. కన్స్ట్రక్టివ్ అప్పోజిషన్ గా ఉంటూ ప్రజల విశ్వాసం పొందడం ఒక పధ్ధతి. పాజిటివ్ అప్రోచ్. తెర వెనక పావులు కదిపి పార్టీ బలపడాల్సిన పరిస్థితులు కల్పించుకోవడం మరో పధ్ధతి. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి ఆర్నెల్లయినా ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. అనేక సమస్యలకి పరిష్కారాలు ఇంకా వెదుకుతూనే వున్నారు. రెండు చోట్లా ప్రతిపక్షాలు కూడా అయోమయంలోనే ఉన్నాయి. పార్టీ పటిష్టానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందా? తెలివైనవాడు ఆవకాశం కోసం వెయిట్ చెయ్యక, అవకాశం సృష్టించుకుంటాడు కదా. సమస్యల పరిష్కారానికి కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో కూడా ఉంటే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడం ఈ సమయంలో మంచి స్ట్రేటజీ. ముందు ఏ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చెయ్యాలో అక్కడ కేంద్రం నుంచి పనులు వేగంగా జరక్కుండా, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎత్తి చూపించి ఆ పరిస్థితికి రాష్ట్రప్రభుత్వానిదీ, పాత కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు బిల్డప్ ఇవ్వచ్చు. పార్టీ కాడర్ చేత అసెంబ్లీల్లో గొడవలు ధర్నాలు, సత్యాగ్రహాలు చేయించొచ్చు. ఆ రకంగా పార్టీకి విజిబిలిటీ తెప్పించి, వీలుని బట్టీ అధికారం గుంజుకోవచ్చు. అధికారం సంగతెలా ఉన్నా అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెంచుకోవచ్చు. ఏపీలో మిత్రపక్షం కనక కొంచెం కష్టం, స్లో ప్రాసెస్. ఐనా ట్రై చెయ్యడంలో తప్పులేదు కదా. తెలంగాణాలో ఐతే ఎక్కువ మొహమాటం పడక్కర్లేదు.

***

మొన్న కొత్తగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న ఓ ప్రముఖవ్యక్తి విగ్రహం తయారౌతోందని న్యూస్ వచ్చింది. ఇదేంటబ్బా ఈయనేదో కొత్త రకం రాజకీయానికి తెరలేపుతాడనుకుంటే విగ్రహాలంటూ కొత్త సీసాలో పాత సారా పోసేస్తున్నాడూ అనిపిం చింది. పార్టీ కార్యకర్తల, అభిమానుల అత్యుత్సాహమే కానీ ఇది ఈయనకిష్టమయ్యే విషయం కాదనిపించింది. అక్కణ్నుంచి ఆలోచన అసలు ఈ విగ్రహ రాజకీయాల కధ కమా మిషుల వైపు మళ్లింది. చివరికి ప్రతీ ఒక్క నాయకుడూ తన విగ్రహమో, తన పార్టీ అధినేత విగ్రహమో లేదా ఇంకా రాజకీయాల్లో వాడుకోబడుతున్న ఏ ప్రముఖ నేత విగ్రహమో, ఏదో ఒకటి కానీ అన్నీ కానీ, ప్రతిష్ట-నాశనము-పునఃప్రతిష్ట -విగ్రహ శుద్ధి -విగ్రహ పూజ అను బహుళార్ధ సాధక ప్రాజెక్టుని తలకెత్తుకోవటం చాలా అవసరం అని తేలింది. ఎలాగంటే –  విగ్రహాలు ఎలాంటి వాళ్లకి పెట్టాలి? స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు, తెలుగు వెలుగులు, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఈ విషయం మనందరికీ తెలుసు. నిజంగా తెలియాల్సినవాళ్ళకీ తెలిస్తే మీడియాకీ, జనానికీ చాల టైం కలిసి వస్తుంది. అని మనం అనుకుంటాం. వాళ్ళు తెలుసుకోట్లేదు అనుకుంటాం కానీ అసలు సంగతి అది కాదు. వాళ్లకి తెల్సు.

విగ్రహరాజకీయాలు న్యూస్ పేపర్ల వరకే అని, జనం ఐదేళ్లపాటు తమని మర్చిపోకుండా ఉండేందుకు ఛోటా మోటాలు చేసే డ్రామాలనీ, విగ్రహాలు ధ్వంసం చెయ్యడం, పాలాభిషేకాలు, వంటివి పొలిటికల్ గిమ్మిక్స్ అని – అనుకుంటే అది అమాయకత్వం. నాయకులంటే విజనరీస్ అని నమ్మితే విగ్రహ రహస్యం అర్ధం అవుతుంది. విగ్రహ రాజకీయాల వెనక ఒక విజన్ ఉంది. అది డొమెస్టిక్ ఎకానమీని పటిష్టం చెయ్యడం.

ఫరెక్జాంపుల్ –

ఉన్న విగ్రహాలని విరగ్గొట్టి, కొత్తవి పెట్టడం వల్ల అవి తయారు చేసే వాళ్ళకి ఉపాధి. మామూలుగా వినాయక చవితి టైములో బిజీగా ఉండే వీళ్ళు సంవత్సరమంతా బిజీ అయిపోతారు.

విగ్రహాలు లేనిచోట కొత్తవి పెట్టడం – ఇదీ ఉపాధి కార్యక్రమమే

వీలైనప్పుడల్లా పాలాభిషేకాలు చెయ్యడంవల్ల   డైరీ ఇండస్ట్రీకి చేయూత

అభిషేకంతో పొంగి పొరలిన పాల వల్ల విగ్రహం చుట్టూ చేరిన బురదలో మస్కిటో బ్రీడింగ్ జరుగుతుంది. జ్వరాలు, ఎట్సెట్రా ప్రబలి లోకల్ మందుల షాపులు, నాటు&మోటు వైద్యులకి మంచి బిజినెస్

ఇవి కాక కాకి రెట్టలు క్లీన్ చెయ్యడం; పాత విగ్రహాలకి రంగులు వెయ్యడం వంటి పుణ్య కార్యాల వల్ల ఆయా పన్లు చేసేవారికి పని. విగ్రహాలు ఎంత ఎక్కువగా స్థాపిస్తే అంత ఎక్కువ ఉపాధి అవకాశాలు. పనిలో పని కాకుల జనాభానీ పెంచితే ఏడాదంతా పెయింటింగ్ & క్లీనింగ్ వృత్తివారికి చేతినిండా పని. అన్ని విగ్రహాలున్నాయి మరి.

విగ్రహ స్థాపన, విధ్వంసనాది పుణ్యకార్యాలు గూండావృత్తిలో వున్న పౌరశ్రేష్ఠులకి, వాటికి కవరేజ్ ఇచ్చే మీడియా వారికీ ఇతరత్రా విషయాలేవీ లేనప్పుడు పని కల్పించి ఉపయోగపడతాయి.

ఇంకో మెట్టు పైకెక్కి మాయావతి స్టైల్లో స్టేట్ అంతా తన విగ్రహాలతో పాటు పార్టీ గుర్తుకీ విగ్రహాలు పెట్టేస్తే అది కుంభకోణం స్థాయికి అప్ గ్రేడ్ అయ్యి, దాన్నిఇన్వెస్టిగేట్ చెయ్యడానికి మళ్ళీ కమిషన్లు, కేసులు, వగైరా… ఆయా పనులు చేయాడానికి నియమితులయ్యే రిటైర్డ్ జడ్జీలు, వారికి కావాల్సిన మందీ మార్బలం….

ఆహాహా! ఎంత ఎంప్లాయిమెంట్ జెనరేషన్ + ఎంతటి డెవలప్-మెంట్ ఆఫ్ డొమెస్టిక్ ఎకానమీ! ఈ కారణాలవల్ల విగ్రహరాజకీయాలని వ్యతిరేకించడం కన్నా బలపరచడమే దేశానికి మంచిదని తెలుస్తోంది. ఆర్ధిక వ్యవస్థని, ఉపాధి అవకాశాలని పెంచటానికి ఇవన్నీ ఉపయోగపడతాయని నాయకులు, అభిమానులు ఈ ప్రాజెక్టులని ప్రోత్సహిస్తున్నారు కానీ స్వాంతంత్ర్య సమర యోదులకి, అమరులకి, వివిధరంగాల్లో ప్రముఖులైన వారికి మాత్రమే విగ్రహాలు పెట్టాలని తెలియక కాదు. సో, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న ప్రతి వర్ధమాన నాయకుడూ విగ్రహ స్థాపన మరియు విధ్వంసన అను బహుళార్ధ సాధక ప్రాజెక్టుని మరువరాదు.

***

“Item girls should be called prostitutes,” -అని ఓ పెద్ద మనిషి సలహా, కాదు డిమాండు. సినిమాలు అసహ్యంగా తయారయ్యాయి. అందులో డౌట్ లేదు. సినిమాల్లో అసభ్యతని ఎత్తిచూపడానికి ప్రాస్టిట్యూట్స్ ని ఇన్వాల్వ్ చెయ్యాలా? అవమానించాలా?మరయితే ఐటం డాన్సుల్ని సినిమాల్లో పెట్టే నిర్మాతలూ, దర్శకులూ, డబ్బు కక్కుర్తితో డాన్సులు చేసే హీరోయిన్లు, అవి ఎగబడి చూసే జనం – వీళ్ళందర్నీ ఏమనాలి? ప్రాస్టిట్యూషన్ కి సపోర్టింగ్ ఇండస్ట్రీ అనాలా? అందుకే స్టేట్మెంట్ వెనక ఆయన ఉద్దేశాన్ని, బాధని అర్ధం చేసుకోవచ్చు కానీ తరిచి చూస్తే మోటుగా, మొరటుగా, క్రూరంగా, తెలివి తక్కువగా ఉంది. ఇంకా లోతుగా చూస్తే సమస్యలోని ఇతర కోణాలు కూడా ఓపెన్ అప్ అవుతాయి. prostitution ఎవరూ కావాలని ఎన్నుకునే వృత్తి కాదు. కొందరు అందులోకి నెట్టబడతారు, కొందరు గతిలేక అందులోకి దిగుతారు. ఈ రెండు విషయాల్లోనూ నైతిక బాధ్యత సమాజనిదీ, ప్రభుత్వానిదీ అవుతుంది తప్ప ఆ వృత్తిలో ఉన్నవాళ్ళది కాదు. వాళ్ళని కించపరచడం అనవసరం, అమానుషం. సర్వైవల్ కీ, విలువలకీ మధ్య సంఘర్షణ మొదలైతే సర్వైవలే గెలుస్తుంది. అది తప్పు అంటే దేశంలో ఆకలి బాధ లేకుండా చెయ్యాలి, ప్రాధమిక అవసరాలు వేటికీ ప్రజలు కష్టపడాల్సిన అవసరం లేకుండా చెయ్యాలి. అలా ఎందుకు చెయ్యలేకపోతున్నాం? ఇలాంటి స్టేట్-మెంట్లు ఇచ్చేవాళ్ళు దేశంలో జరుగుతున్న human trafficking గురించి, గత్యంతరంలేక ప్రాస్టిట్యూషన్ చేస్తున్నవాళ్ళ సమస్యలని తీర్చడం గురించీ ఆలోచించి, పరిష్కారాలు కనిపెట్టి అమలు చెయ్యాల్సిన బాధ్యత లేనివాళ్ళయి ఉంటారు. లేకపోతే ఆలోచనారహితులు, సానుభూతిరహితులతో నిండిన వోట్ బాంకుల దృష్టి ఆకర్షించే పనిలో ఉన్నవాళ్ళయ్యుంటారు. ఎవరైతే మాత్రం నిర్భాగ్యులని కించపరచాలా? తప్పదు అంటే ప్రాస్టిట్యూషన్ తప్పు అంటే, ఆ వృత్తికి ఆధారమైన మానవ బలహీనతలని కంట్రోల్ చేసుకోమని అ వర్గాన్నీ వత్తిడి చెయ్యాలి. ప్రతీ చిన్న విషయానికీ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గొడవ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఇప్పుడు ఈ వర్గం మనోభావాల్ని పట్టించుకునేదెవరు? ఎన్ని స్టేట్-మెంట్స్ ఇచ్చినా డాన్సులు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు పట్టించుకోరు. మధ్యలో ఒక నిర్భాగ్యవర్గం మాత్రం అవమానాన్ని దిగమింగుకోవాలి. అసలు అవమానపడాల్సినదెవరు? గతిలేక ప్రాస్టిట్యూట్స్ అయినవాళ్ళా? డబ్బు కక్కుర్తితో డాన్సులు పెట్టే, చేసే, చూసే వాళ్ళా?

***