నో.వా.చే.రా – “ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” (002)


బోరు బావి సంఘటనలు మనలో ఉన్న ఎపతీని ప్రతిబింబించే ఒక ఉదాహరణ మాత్రమే. ఎన్నెన్ని దుర్ఘటనలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, బయటపడనివి ఎన్ని జరుగుతున్నాయో ఊహించుకుంటే …. OMG !!

బాలుడేనా? బాలిక ఎంత క్షోభ పడుతోందీ దేశంలో?

ఎవరో వస్తారని ఏదో చేస్తారని … ఎదురుచూస్తూ మోసపోవడం, అదే, మన్ని మనం మోసం చేసుకోవడం మనకి అలవాటైపోయింది. మన సంస్కృతి, మన ఫిలాసఫీలని మించినవి లేవు, అందులో నిస్సందేహంగా సందేహంలేదు. ఐతే వాటిని నిత్యజీవితానికి, సామాజిక జీవితానికి అన్వయించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఇందులో కూడా సందేహం లేదు అనుకుంటున్నా.
మనలో అందరికీ వ్యక్తిగతంగా అత్యున్నత ఆదర్శాలు, ఆశయాలు, వాటిని సాధించుకునే ఉత్తమ మార్గాలు, విలువలు అన్నీ ఉన్నాయి. అవి ఎంత స్ట్రాంగ్ గా, ఎంత డీప్ గా  ఉన్నాయనేది తెలిపేది ఇలాంటి సంఘటనల్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో అది.

ఒక్క బోర్ వెల్ దుర్ఘటనలో భౌతికంగా, మానసికంగా లేక రెండు విధాలా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ లిస్టు రాస్తే –

1.బోర్ వేయించే వ్యక్తీ
2.వేసే కాంట్రాక్టర్
3.అనుమతులిచ్చే ప్రభుత్వ శాఖలు, అధికారులు
4.మధ్యవర్తులు (వీళ్ళు  ప్రజా ప్రతినిధులు కావచ్చు, లోకల్ గా పెద్ద తలకాయలు కావచ్చు)
5.బాధిత కుటుంబం
6.మీడియా
7.సివిల్ డిఫెన్స్ / ఫైర్ డిపార్ట్-మెంట్
8.పాఠకులు/ప్రేక్షకులు  in other words సమాజం

వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా విడివిడిగా చూస్తే, స్థాయిలో ఎక్కువ తక్కువలున్నా, విలువల మీద గౌరవం ఉంటుంది. ఏదో మంచి సాధించాలనే ఉంటుంది. చాలా మంది వారి కుటుంబం స్థాయిలోనో, వారి వర్గ స్థాయిలోనో ఎంతో కొంత మంచి సాధించి కూడా ఉంటారు. ఐతే అందులో మళ్ళీ చాలామంది పొరపాటునో గ్రహపాటునో జరిగిన దుర్ఘటనకి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ధైర్యంగా, నిజాయితీగా ఎదుర్కోరు. కేసు మరీ జటిలం కాకుండా, శిక్షలు పడకుండా చూసుకోవడమే ప్రధానం అవుతుంది. విలువలన్నీ వెనక్కిపోతాయి. అడ్డదార్లు వెతుకుతారు. నా ఉద్దేశం చాలామటుకు బాధ్యులు బాధ పడతారు. చిన్న పిల్లల ప్రాణాలు పోవడం ఎవరికి సమ్మతంగా ఉంటుంది? అందరూ సినిమా విలన్స్ అంత క్రూరంగా ఉంటారా? కానీ బాధ్యత నెత్తిమీద వేసుకోరు. అప్పుడే ముందు పోస్ట్ లో రాసుకున్నసమీకరణం తన పని తాను చేసుకుపోతుంది. ఎలా పని చేస్తుందో వివరణ అవసరమా? వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, సామాజిక బాధ్యతలు అన్నిటికీ ఎవరికి వారు – బుద్ధిపూర్వకంగా కొందరు, నిస్పృహతో కొందరు, నిర్లిప్తతతో కొందరు – తాజ్ మహళ్ళు కట్టేస్తారు/స్తాం.

ఇక్కడో రెండు ప్రశ్నలు –
వ్యక్తిగత విలువలు అందరిలో సమానంగా ఉన్నప్పుడు అవి సామాజిక విలువలు అవ్వవా?
మెజారిటీ ప్రజలు విలువలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అవి సామాజిక బాధ్యతగా మారడానికి అడ్డం ఏముంటుంది?
ఈ రెండూ జరగట్లేదు కనకే అన్ని విధాల దుర్ఘటనలు, దుష్కృత్యాలు, సాంఘిక దురాచారాలు ఎక్కువైపోతున్నాయి. అని నా అభిప్రాయం.
సామాజిక బాధ్యతల విషయంలో ప్రజలు రాజీ పడరని తెలిస్తే ఏ ప్రభుత్వమూ, నాయకుడూ, మీడియా or బిజినెస్ మాన్ వాటితో రిస్క్ తీసుకోరు. చచ్చినట్టు ప్రజలకి ఏది ఇష్టమో అదే చెయ్యడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజాభిప్రాయం నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, అసందింగ్ధంగా పై వర్గాలకి చేరట్లేదు. ప్రజాస్వామ్యం అంటే యధా రాజా తధా ప్రజా కి రివర్స్, యధా ప్రజా తధా రాజా. ప్రభుత్వానికీ, లేజిస్లేటర్లకీ వారి బాసులుగా మనమా మెసేజ్ పంపుతున్నామా?ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదు అంటే తట్టిన జవాబే ఈ ఈక్వేషన్ –
ప్రభుత్వ నిర్వ్యాపరత్వం (బాధితుల అవసరాలు, బలహీనతలు+సామాజిక నిర్లిప్తత+ సామాజిక ఆత్మ వంచన+ కులమతవర్గ విబేధాలు)
Government’s inaction (One or all of victims’ ignorance, desperation & covetousness + social apathy + social hypocrisy + various types of social stratification) x Criminal’s Optimism

ఈక్వేషన్ లో కుడి పక్క ఉన్న ఫాక్టర్స్ లో ఒకటి లేక కొన్ని లేక అన్నీ అవాంఛనీయ సామాజిక పరిణామాలకి – బోర్ వెల్ ఘటనలు, వివిధ రకాల అత్యాచారాలు, దుర్ఘటనలు – కారణాలు అవుతున్నాయి. ఈ ఫాక్టర్స్ లో ప్రతీ ఒకటి 0 అయితే గవర్నమెంట్ ఇనాక్షన్ కి చోటుండదు. ఎన్ని ప్రయాసలు పడైనా ప్రభుత్వం ఆ సమస్యని పరిష్కరించాల్సిన స్థితి, at least theoretically, వస్తుంది. ప్రస్తుతం గవర్నమెంట్ ఇనాక్షన్ 100 అనుకుంటే ఒకొక్క ఫాక్టర్ విలువ తగ్గిన కొద్దీ ఇనాక్షన్ అనులోమానుపాతం(direct proportion) లో తగ్గుతుంది. ప్రతీ ఒకటి సున్నా అవడం అత్యాశే, సున్నా చేయడానికి ప్రయత్నించడం దురాశ కాదు. నేరస్తుడు ఎంతటి ఆశావాది ఐనా – ఎన్ని పైరవీలు, లంచాలు, బెదిరింపులు పని చేసినా –  పై ఫాక్టర్స్ తగ్గిన కొద్దీ దాని ప్రభావం తగ్గక తప్పదు.  ఐతే అవి తగ్గడానికి వీల్లేని విధంగా ప్రస్తుత సమాజం ముక్కలైపోయింది. రాజకీయాలు, వోట్ బాంకులు, కుల మత తత్వాలు, క్లాస్ డిఫరెన్సులు వర్గవిబేధాల్ని కొనసాగిస్తున్నాయి.

పై ఫాక్టర్స్ అన్నిటినీ విడివిడిగా పూర్తిగా అర్ధం చేసుకున్న స్కాలర్స్, సంస్కర్తలు, సంఘసేవకులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి కృషిని సమన్వయం చేసి ఫలితాలు సాధించగల ప్రజాసంస్థలు ఉన్నాయి. వ్యక్తులు, వివిధ ప్రజా సంస్థలు ఒకటయి పనిచెయ్యాలి. ప్రజాప్రతినిదుల్ని పార్టీలకతీతంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి చర్చించాలి. జనం ఆత్మవంచన చేసుకోకుండా ఈ కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి. నేతలకి, బాబూడమ్ కి ప్రజాభిప్రాయం ఏమిటో ఐడియా ఇవ్వాలి. ఒక్క బోర్ వెల్ దుర్ఘటనల్ని పూర్తిగా ఆపగలిగితే చాలు. మిగిలినవి సాధించటానికి అందరికీ స్ఫూర్తి కలుగుతుంది. అనవసరంగా పోగొట్టుకున్న పసిప్రాణాలకి ………

ఇదంతా థియరీ, విష్ ఫుల్ థింకింగ్, డే డ్రీమింగ్, ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ –

“ఒరేయ్!బాలుడా! జాగ్రత్తరోయ్..” పై ఎంకరేజింగ్ గా వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడే చూసి ఇంకా వ్రాస్తున్నా –

దేశంలో జరిగే అన్ని అవాంఛనీయ సంఘటనల్లోకీ అత్యంత సీదాసాదా మూల కారణాలున్న సమస్య ఇది. రోడ్ల మీద కవర్స్ లేకుండా వదిలేసిన మాన్-హోల్స్ లొ పడి, పోయిన సంఘటనలకీ బోర్ వెల్ మృతులకీ పెద్ద తేడాలేదు. కొద్దిపాటి ముందు జాగ్రత్త చర్యలతో నివారించగల ఈ సమస్యలకి కేవలం పని చేస్తున్న వాళ్ళ అజాగ్రత్తే ముఖ్య కారణం. ఆపైన పని చేయిస్తున్న బోర్ యజమానికి ఏ బాధ్యతా లేకపోవడం రెండో కారణం. విషయం కోర్టు వరకూ వెళ్లకుండా సెటిల్మెంట్ జరిగిపోవడం మూడోది. ప్రభుత్వం, మీడియా, సమాజం పసివాడు పడిన చిత్రహింసని తేలిగ్గా మర్చిపోవడం నాలుగోది. టూ మచ్ కదా?

పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే –
ప్రభుత్వ నిర్వ్యాపరత్వం ∝ (బాధితుల అవసరాలు, బలహీనతలు+సామాజిక నిర్లిప్తత+ సామాజిక ఆత్మ వంచన+ కులమతవర్గ విబేధాలు) x నిందితుడి ఆశావాదం
Government’s inaction ∝ (One or all of victims’ ignorance, desperation & covetousness + social apathy + social hypocrisy + various types of social stratification) x Criminal’s Optimism

ఈక్వేషన్ లో అన్ని ఫాక్టర్స్ లో మార్పు రావాలి. అతిముఖ్యంగా బ్రాకెట్లో ఉన్నవి తగ్గాలి. అదో కల అంతే. నిజమైతే బావుంటుంది.

ప్రాక్టికల్ సొల్యూషన్ చాలనుకుంటే –

పని మొదలుపెట్టే ముందు పరిసరాల, వర్కర్ల భద్రతకి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు తీసుకుంటారో తెలియదు కానీ గట్టిగా పరిశీలిస్తే వాటిల్లో లొసుగులు బయటపడచ్చు. పడతాయి.
బోర్ వెల్ కంపెనీకి భద్రతాదికారి ఉన్నాడా? అవసరమైన స్థాయిలో భద్రతా నియమావళి ఉందా, లేదా?
నియామావళి ఆధారంగా కంపెనీ భద్రతా నిర్వహణ పద్ధతులు తయారుచేసిందా, లేదా?
పనికి ముందు అనుమతి పత్రాల్ని జారీ చేసే ప్రభుత్వాధికారి ఎవరు? పనికి ముందు, తర్వాత వాళ్ళు చేసే తనిఖీలేమిటి?
పని ఏర్పాట్లు జరిగిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నట్టు ఎవరు ద్రువీకరిస్తారు?
పని జరిగే సమయంలో దానితో సంబంధం లేనివాళ్ళు అక్కడ లేకుండా చూసే బాధ్యత ఎవరిది?

ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్టు జవాబులు రావాలంటే కంపెనీ నిర్వహణ ఖర్చు పెరగడం ఖాయం. నిజానికి పెద్ద పరిశ్రమల్లో పాటించే భద్రతా నియామాలు, భద్రతా ప్రమాణాలు; అందుకు వాటికుండే వనరులు, సౌకర్యాలు చిన్నవాటికీ ఉండాలంటే అది ఆ కంపెనీలకి కష్టమౌతుంది. అందుచేత ఇవన్నీ తప్పనిసరి అంశాలు చెయ్యడంలో ఆలస్యం జరుగుతుంది. బోర్ వెల్ కంపెనీలని దుర్ఘటనల విషయంలో గట్టిగా నిలదియ్యడంలో ఇదో అడ్డంకి. అధికారిక తనిఖీల ద్వారా వీటిని కంట్రోల్ చెయ్యడం కూడా కష్ట సాధ్యం, అందుకు అవసరమయ్యే ప్రభుత్వ వనరుల దృష్ట్యా.

ఒకవేళ బోర్ వెల్ కంపెనీకి భద్రతా నియమావళి, వగైరాలు ఉన్నా సైటులో పని జరిపించే  స్టాఫ్ నిర్లక్ష్యం, అజ్ఞ్జానాల పాత్ర చాలా ఉంటుంది. నిజానికి మూడొంతుల కేసుల్లో ఇదే అసలు సమస్య అయిఉండవచ్చు. పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో, మంచి భద్రతా నిర్వహణ ఉన్న సంస్థల్లో కూడా 90% ప్రమాదాలు వ్యక్తుల నిర్లక్ష్యం, అజ్ఞ్జానాల వల్లే జరుగుతాయనేది నిజం. Accidents do not happen, they are caused అనేది భద్రతా నిపుణులకి బాగా తెలిసిన విషయం. పెద్ద కంపెనీల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు చోటామోటా కంపెనీల గురించి చెప్పుకునేదేముంటుంది? వీటిల్లో పనిచేసే వాళ్ళ స్కిల్స్, ట్రైనింగ్ గురించి అసలు మాట్లాడే పని లేదు.

బోర్ ఏ దశలో ఉండగా ప్రమాదం జరిగిందనేది తెలిస్తే ఇంకొంత క్లారిటీ ఉంటుంది.

బోర్ పని మధ్యలో ఆపినప్పుడు జరిగిందా? బోర్ పడదని నిర్ణయించి పని ఆపేసి కంట్రాక్టర్ వెళ్ళిపోయాక జరిగిందా అనేది చూడాలి.
మొదటి దశలో జరిగితే కంట్రాక్టర్ ది ప్రధాన బాధ్యత, రెండో దశలో అయితే బోర్ యజమానిది పూర్తి బాధ్యత. రెండిట్లోనూ బోర్ యజమాని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ కాక పసివాణ్ణి ఆ ప్రాంతంలోకి వెళ్ళనిచ్చిన తల్లితండ్రుల సంగతేమిటి? బోర్ తియ్యడానికి అనుమతి ఇచ్చి దానివల్ల జరగగల ప్రమాదాల విషయం పట్టించుకోని ప్రభుత్వం, ఈ విషయాలపై పోరాడని మీడియా, సమాజం… అందరూ ప్రమాదానికి కారకులే. ప్రమాదం జరిగాక ఎవరికి చేతైన విధంగా వాళ్ళు తప్పించుకుంటారు.

అందరూ బాధ్యత ఫీల్ అయ్యేవాళ్ళయితే –

1. బాలుడు ఆ దరిదాపుల్లో ఉండేవాడు కాదు.
2. బోర్ యజమాని పని జరుగుతుంటే ఇతరులు అక్కడికి రాకుండా బారికేడ్ వేస్తాడు. బోర్ పడక పని ఆగిపోతే, గోతిని పూడ్చడమో,  కవర్ వెయ్యడమో చేస్తాడు.
3. కంట్రాక్టర్ ఓ భద్రతా నియమావళి పెట్టుకుని అది అమలయ్యేలా చూస్తాడు. తన సిబ్బందికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తాడు. పని జరిగేటప్పుడు సేఫ్టీకి అవసరమైన పరికరాలు, వస్తువులు ఏర్పాటు చేస్తాడు. సిబ్బందిలో ఒకణ్ణి సేఫ్టీ వాచ్-మన్ గా పెడతాడు.
4.అనుమతి ఇచ్చిన అధికారి పనికి ముందూ, తర్వాత తనిఖీ చేస్తాడు.
5.మధ్యవర్తులు ఉండరు. ప్రజాప్రతినిధులు పై నాలుగు పాయింట్లూ అమలయ్యేలా తమ అధికారాల్ని, ప్రజా సంబంధాల్నీ ఉపయోగిస్తారు.
6. మీడియా – సమస్యని ప్రజల దృష్టి పధంలోంచి జారిపోకుండా ఈ పనుల తీరుతెన్నులు హైలైట్ చేస్తుంది.
7.పాఠకులు/ప్రేక్షకులు  in other words సమాజం -NGOలు, ప్రజా సంఘాల రూపంలో, సంతకాల ఉద్యమాల్లాంటి కార్యక్రమాలతో, డిమాన్స్ట్రేషన్లతొ సమస్య పరిష్కారం అయ్యేవరకూ కృషి చేస్తారు.

న్యాయమో కాదోగానీ, పై వాటిలో దేనివల్ల ప్రమాదం జరిగిందనేది వదిలిపెట్టి కాంట్రాక్టర్ కి, బోర్ యజమానికి కఠిన శిక్షలు, జరిమానాలు అమలు చేస్తే పరిస్థితి బాగు పడవచ్చు. కానీ వాటి బదులుగా కేసు లేకుండా చూసుకుంటే? ఏ గొడవా ఉండదు. ఎవరూ పన్చేయ్యక్కర్లేదు. ప్రజలు రాజీపడరని తెలిస్తే ఏ నాయకుడూ, అధికారీ, మీడియా or బిజినెస్ మాన్ సామాజిక బాధ్యత విషయంలో రిస్క్ తీసుకోరు. చచ్చినట్టు అవసరమైనవన్నీ చేసితీరుతారు. మనమే వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వట్లేదు. ఆ మెసేజ్ –

యధా ప్రజా తధా రాజ.

ప్రజలుగా మనం వాళ్లకి బాసులం. వాళ్ళని సీరియస్ గా గమనిస్తున్నాం. పని చేసినవాడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని వాళ్లకి తెలిసేలా బిహేవ్ చేస్తాం.  అంతకంటే ముందు మన్ని మనం మార్చుకుంటాం.
సామాజిక నిర్లిప్తత, సామాజిక ఆత్మ వంచన, కులమతవర్గ విబేధాలు – వీటిలో ఎవరి వంతు వాళ్ళు మైనస్ చేసేస్తాం.

బోరు బావి బాలల అమాయక త్యాగాలకి కృతజ్ఞ్జతగా

********************************************************************

Part 1

మొన్న ‘బోరు బావిలో పడిన బాలుడు’ వార్త మళ్ళీ వచ్చింది. ఎన్ని మళ్ళీలయ్యాయో ఇలాంటి మొదటి సంఘటన వార్తల్లో వచ్చినప్పట్నుంచీ, 2005 అని గుర్తు. ఈ సారి అదృష్టంకొద్దీ పిల్లాడిని ప్రాణాలతో బయటికిలాగారు. ఎవరు? అధికారులు. ఎవరో వేసుకుంటున్న బోర్ వెల్, దానికి ఎవరో కంట్రాక్టర్, సంబంధంలేని పిల్లలు అక్కడికి రావడం, ఆ బోర్ లో పడడం, అక్కణ్ణుంచీ మీడియా హడావిడి, అధికార్లు బాలుణ్ణి బయటికి తీసే ప్రయత్నం చెయ్యడం, ఎక్కువసార్లు విఫలమవ్వడం…

ఏం జరుగుతోందిక్కడ?

ఏమీ జరగట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరూ ఏం చేయ్యకపోతుంటే?

నీ తల్లిదండ్రులతో సహా సమాజం, ప్రమాద కారకులు, ప్రభుత్వం, మీడియా – ఎవరూ ఏమీ చెయ్యట్లేదు. అందువల్లే బోరు బావుల్లో బాలుడు మాటి మాటికీ పడుతూనే ఉన్నాడు. వాడికి బుధ్ధొచ్చి పడడం మానెయ్యలేగానీ వీళ్ళందరూ ఏం చెయ్యరు. జరిగినదాన్ని మర్చిపోవడమనే కన్వీనియెంట్ థింకింగ్ కి అలవాటు పడిపోయారు.
ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్!

నువ్వు భావి భారత పౌరుడివి కావాలి, బోరు ‘బావి’ పౌరుడు కాదు.

బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ఈ ఈక్వేషన్ గుర్తు పెట్టుకో –
(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

నువ్వు బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో. జవాబు క్లియర్ గా లేకపోతే ఆ చుట్టుపక్కలకెళ్ళకు. ఆ ప్రశ్నలు –
ఏమైనా రెగ్యులేషన్ ఉందా ఈ బావులు తవ్వటానికి సంబంధించి?

బావిలో పడిన పిల్లల ప్రాణాలు పోతే ఎవరిదీ బాధ్యత?

బావి చుట్టూ ఏ విధమైన బారికేడ్ లేకుండా వదిలేసే కాంట్రాక్టర్ బాధ్యత ఏమిటి?

ఆ పనితో సంబంధం లేని వాళ్ళు అక్కడకి వస్తే, ప్రమాదంలో పడితే ఆ పని చేస్తున్న, చేయించుకుంటున్న వ్యక్తులకి ఏ సంబంధం లేకపోవడం ఏమిటి? ఒకవేళ ఉండుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలేమిటి?

బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేవరకూ రిపోర్ట్ చేసే మీడియా ఆ తరువాత ఏం జరిగిందో, ఏం జరగాలో చెప్పదేమిటి?

ఈ ప్రశ్నలు చాలామందికి ఉన్నా అడగరు. బాధితులు పేదవాళ్ళు కనక ఏదో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిందని గెస్ చేస్తారు. నిజానికి అదే అయినా ఆశ్చర్యం లేదు. అంగబలం, అర్ధబలం లేనివాళ్ళు అంతకన్నా ఏం చెయ్యగలరు? సంఘటిత వర్గం కాదు. డబ్బు వస్తుందంటే ఆశపడి జరిగిన అన్యాయాన్ని, బలైపోయిన పసిప్రాణాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ, తండ్రి మందు కొట్టి బాధని బాటిల్లో, సారీ సారా పాకెట్ లో దింపేస్తే, తల్లి స్త్రీ గా తనకి జరుగుతున్న అన్యాయాల్లో ఇదీ ఒకటనుకునో, భర్త చేతిలో దెబ్బలు తినో, రాబోయే నష్టపరిహారంతో కూతురి పెళ్లి జరుగుతుందనో … ఏదో ఒకటో లేక ఈ కారణాలన్నిటి వల్లో మళ్ళీ ఇంకోసారి తలవంచుతుంది.

అన్నిటికీ మించి సబ్-కాన్షస్ గా పనిచేసే ఫాటలిజం, predeterminism, మనలో ఎలాగూ ఉంది. అది బాధితుల మీదా, చోద్యం చూస్తున్న సమాజం మీదా సమానంగా పని చేస్తుంది. అది పనిచేయ్యలేనిది ప్రమాదకారకుల మీద మాత్రమే. ఏదో విధంగా బాధితుల్ని మేనేజ్ చేసి, జనం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చనే ఆశావాదం కలవాళ్ళు వారు.

(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)

మనలో ఉన్న ఫాటలిజం, దానివల్ల + వర్గ విబేధాల వల్ల వచ్చే నిర్లిప్తత ఉన్నా మాలో ఇవేమీ లేవని మనకి మనం చెప్పుకునే self-conceit నే సామాజిక ఆత్మవంచన అంటాం.
ప్రజాస్వామ్యం, మానవత్వం ఈ రెండూ లోతుగా వేళ్ళూనని రెండు గొప్ప వృక్షాలు మన సమాజంలో. ఆ వేళ్ళు ఇప్పటికి కొన్ని వర్గాలనే, అదీ కొన్ని పరిమితుల మేరకే చేరుకున్నాయి. అవి అందరినీ వారి వారి శక్తిసామర్ధ్యాలతో సంబంధం లేకుండా రక్షించగలిగినప్పుడే అవి మన సమాజంలో వ్యవస్థీకృతం (Institutionalized) అయ్యాయని చెప్పుకోగలం. అప్పటి వరకు ప్రజాస్వామ్యం కొన్ని పరిధుల్లో పరిమితమైపోతుంది. మానవత్వం ఒక వ్యక్తిగత విలువగానే ఉండిపోతుంది. అది సామాజిక బాధ్యతగా ఇంకా పూర్తీ రూపాంతరం చెందలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వం సామాజిక విలువలు, బాధ్యతలు కాలేదని చెప్పడానికి ఆధారం పై ప్రశ్నలకి సరైన సమాధానాలు లేకపోవడమే. అవి సామాజిక విలువలు అయివుంటే ముందుగా –

(1) ప్రమాదం జరగకుండా కంట్రాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధంలేని వాళ్ళు సైటులోకి రాకుండా సైటు సొంతదారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవేమీ జరగని పరిస్థితిలో వాళ్ళు అనుభవించాల్సిన శిక్షలను న్యాయశాస్త్ర పరంగా ప్రభుత్వం నిర్ణయించేది.

(2)పని ప్రారంభించే ముందు సేఫ్టీకి సంబంధించి తీసుకున్న అన్ని జాగ్రత్తలు వివరిస్తూ కంట్రాక్టర్, బోర్ సైట్ యజమాని సంతకం చేసిన సేఫ్ వర్క్ పర్మిట్ పై ప్రభుత్వాధికారి (బోర్ లో ఎవరైనా పడినప్పుడు వాళ్ళని రక్షించే శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్?) సంతకం చేసి అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టేది.

(3)ఈ విషయంలో సరైన చట్టాలు తేవాలని ప్రజాసంఘాలు కానీ, వ్యక్తులు కానీ – వారి నుంచి ప్రభుత్వం పై వత్తిడి పెరిగేది, .

(4)ప్రమాదాలకి దారితీయగల అవకాశమున్న అన్ని పనులలో కాంట్రాక్టర్ల, ఆ పని చేయించుకుంటున్న సంస్థల/వ్యక్తుల బాధ్యతలేమిటనే చర్చ ప్రజలలో మొదలై ప్రజాప్రతినిదులకి ఆ వేడి అంటేది.

మొదటి రెండు పాయింట్లు నిజానికి ఉచిత సలహాలు. ఏ మట్టి బుర్రకైనా తడతాయి. చివరి రెండు మాత్రం సామాజిక స్పృహ ఉన్న సమాజాల్లోనే తలెత్తుతాయి. తోటి మనిషి తన సంతానాన్ని కేవలం కొందరి అజాగ్రత్తల కారణంగా ఎందుకు కోల్పోవాలనే సహానుభూతి బలంగా ఉన్న సమాజాల్లోనే అది జరుగుతుంది.

ఏ రాష్ట్ర శాసన సభలో కానీ, పార్లమెంట్ లో కానీ ఏ లెజిస్లేటరైనా ఈ ప్రశ్నలు లేవనెత్తారా?
NGOలేవైనా ఏ సమస్యని చర్చించాయా?
ఏ న్యాయవాదీ లేక ప్రజా హక్కుల పోరాటాలు చేసేవాళ్ళు ఇంతవరకూ P.I.L ఎందుకు వెయ్యలేదు?

Maybe I am wrong, but నా ఈ సందేహాలు నిజమేనా? లేకపొతే వీటికి సంబంధించిన న్యూస్, మీడియా కవరేజ్ కి నోచుకోవట్లేదా?

ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ……………..

****************************************************************