మొన్న ‘బోరు బావిలో పడిన బాలుడు’ వార్త మళ్ళీ వచ్చింది. ఎన్ని మళ్ళీలయ్యాయో ఇలాంటి మొదటి సంఘటన వార్తల్లో వచ్చినప్పట్నుంచీ, 2005 అని గుర్తు. ఈ సారి అదృష్టంకొద్దీ పిల్లాడిని ప్రాణాలతో బయటికిలాగారు. ఎవరు? అధికారులు. ఎవరో వేసుకుంటున్న బోర్ వెల్, దానికి ఎవరో కంట్రాక్టర్, సంబంధంలేని పిల్లలు అక్కడికి రావడం, ఆ బోర్ లో పడడం, అక్కణ్ణుంచీ మీడియా హడావిడి, అధికార్లు బాలుణ్ణి బయటికి తీసే ప్రయత్నం చెయ్యడం, ఎక్కువసార్లు విఫలమవ్వడం…
ఏం జరుగుతోందిక్కడ?
ఏమీ జరగట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఎవరూ ఏం చేయ్యకపోతుంటే?
నీ తల్లిదండ్రులతో సహా సమాజం, ప్రమాద కారకులు, ప్రభుత్వం, మీడియా – ఎవరూ ఏమీ చెయ్యట్లేదు. అందువల్లే బోరు బావుల్లో బాలుడు మాటి మాటికీ పడుతూనే ఉన్నాడు. వాడికి బుధ్ధొచ్చి పడడం మానెయ్యలేగానీ వీళ్ళందరూ ఏం చెయ్యరు. జరిగినదాన్ని మర్చిపోవడమనే కన్వీనియెంట్ థింకింగ్ కి అలవాటు పడిపోయారు.
ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్!
నువ్వు భావి భారత పౌరుడివి కావాలి, బోరు ‘బావి’ పౌరుడు కాదు.
బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ఈ ఈక్వేషన్ గుర్తు పెట్టుకో –
(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)
నువ్వు బోర్ వెల్ దగ్గరకెళ్ళేముందు ఈ ప్రశ్నలు వేసుకో. జవాబు క్లియర్ గా లేకపోతే ఆ చుట్టుపక్కలకెళ్ళకు. ఆ ప్రశ్నలు –
ఏమైనా రెగ్యులేషన్ ఉందా ఈ బావులు తవ్వటానికి సంబంధించి?
బావిలో పడిన పిల్లల ప్రాణాలు పోతే ఎవరిదీ బాధ్యత?
బావి చుట్టూ ఏ విధమైన బారికేడ్ లేకుండా వదిలేసే కాంట్రాక్టర్ బాధ్యత ఏమిటి?
ఆ పనితో సంబంధం లేని వాళ్ళు అక్కడకి వస్తే, ప్రమాదంలో పడితే ఆ పని చేస్తున్న, చేయించుకుంటున్న వ్యక్తులకి ఏ సంబంధం లేకపోవడం ఏమిటి? ఒకవేళ ఉండుంటే గవర్నమెంట్ వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలేమిటి?
బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేవరకూ రిపోర్ట్ చేసే మీడియా ఆ తరువాత ఏం జరిగిందో, ఏం జరగాలో చెప్పదేమిటి?
ఈ ప్రశ్నలు చాలామందికి ఉన్నా అడగరు. బాధితులు పేదవాళ్ళు కనక ఏదో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిందని గెస్ చేస్తారు. నిజానికి అదే అయినా ఆశ్చర్యం లేదు. అంగబలం, అర్ధబలం లేనివాళ్ళు అంతకన్నా ఏం చెయ్యగలరు? సంఘటిత వర్గం కాదు. డబ్బు వస్తుందంటే ఆశపడి జరిగిన అన్యాయాన్ని, బలైపోయిన పసిప్రాణాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ, తండ్రి మందు కొట్టి బాధని బాటిల్లో, సారీ సారా పాకెట్ లో దింపేస్తే, తల్లి స్త్రీ గా తనకి జరుగుతున్న అన్యాయాల్లో ఇదీ ఒకటనుకునో, భర్త చేతిలో దెబ్బలు తినో, రాబోయే నష్టపరిహారంతో కూతురి పెళ్లి జరుగుతుందనో … ఏదో ఒకటో లేక ఈ కారణాలన్నిటి వల్లో మళ్ళీ ఇంకోసారి తలవంచుతుంది.
అన్నిటికీ మించి సబ్-కాన్షస్ గా పనిచేసే ఫాటలిజం, predeterminism, మనలో ఎలాగూ ఉంది. అది బాధితుల మీదా, చోద్యం చూస్తున్న సమాజం మీదా సమానంగా పని చేస్తుంది. అది పనిచేయ్యలేనిది ప్రమాదకారకుల మీద మాత్రమే. ఏదో విధంగా బాధితుల్ని మేనేజ్ చేసి, జనం కళ్ళు కప్పి తప్పించుకోవచ్చనే ఆశావాదం కలవాళ్ళు వారు.
(బాధితుల అవసరాలు, బలహీనతలు + సామాజిక నిర్లిప్తత + సామాజిక ఆత్మవంచన + వర్గ విబేధాలు) x నేరస్తుడి ఆశావాదం = ప్రభుత్వ నిర్వ్యాపారత్వం (inaction)
మనలో ఉన్న ఫాటలిజం, దానివల్ల + వర్గ విబేధాల వల్ల వచ్చే నిర్లిప్తత ఉన్నా మాలో ఇవేమీ లేవని మనకి మనం చెప్పుకునే self-conceit నే సామాజిక ఆత్మవంచన అంటాం.
ప్రజాస్వామ్యం, మానవత్వం ఈ రెండూ లోతుగా వేళ్ళూనని రెండు గొప్ప వృక్షాలు మన సమాజంలో. ఆ వేళ్ళు ఇప్పటికి కొన్ని వర్గాలనే, అదీ కొన్ని పరిమితుల మేరకే చేరుకున్నాయి. అవి అందరినీ వారి వారి శక్తిసామర్ధ్యాలతో సంబంధం లేకుండా రక్షించగలిగినప్పుడే అవి మన సమాజంలో వ్యవస్థీకృతం (Institutionalized) అయ్యాయని చెప్పుకోగలం. అప్పటి వరకు ప్రజాస్వామ్యం కొన్ని పరిధుల్లో పరిమితమైపోతుంది. మానవత్వం ఒక వ్యక్తిగత విలువగానే ఉండిపోతుంది. అది సామాజిక బాధ్యతగా ఇంకా పూర్తీ రూపాంతరం చెందలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వం సామాజిక విలువలు, బాధ్యతలు కాలేదని చెప్పడానికి ఆధారం పై ప్రశ్నలకి సరైన సమాధానాలు లేకపోవడమే. అవి సామాజిక విలువలు అయివుంటే ముందుగా –
(1) ప్రమాదం జరగకుండా కంట్రాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధంలేని వాళ్ళు సైటులోకి రాకుండా సైటు సొంతదారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవేమీ జరగని పరిస్థితిలో వాళ్ళు అనుభవించాల్సిన శిక్షలను న్యాయశాస్త్ర పరంగా ప్రభుత్వం నిర్ణయించేది.
(2)పని ప్రారంభించే ముందు సేఫ్టీకి సంబంధించి తీసుకున్న అన్ని జాగ్రత్తలు వివరిస్తూ కంట్రాక్టర్, బోర్ సైట్ యజమాని సంతకం చేసిన సేఫ్ వర్క్ పర్మిట్ పై ప్రభుత్వాధికారి (బోర్ లో ఎవరైనా పడినప్పుడు వాళ్ళని రక్షించే శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్?) సంతకం చేసి అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టేది.
(3)ఈ విషయంలో సరైన చట్టాలు తేవాలని ప్రజాసంఘాలు కానీ, వ్యక్తులు కానీ – వారి నుంచి ప్రభుత్వం పై వత్తిడి పెరిగేది, .
(4)ప్రమాదాలకి దారితీయగల అవకాశమున్న అన్ని పనులలో కాంట్రాక్టర్ల, ఆ పని చేయించుకుంటున్న సంస్థల/వ్యక్తుల బాధ్యతలేమిటనే చర్చ ప్రజలలో మొదలై ప్రజాప్రతినిదులకి ఆ వేడి అంటేది.
మొదటి రెండు పాయింట్లు నిజానికి ఉచిత సలహాలు. ఏ మట్టి బుర్రకైనా తడతాయి. చివరి రెండు మాత్రం సామాజిక స్పృహ ఉన్న సమాజాల్లోనే తలెత్తుతాయి. తోటి మనిషి తన సంతానాన్ని కేవలం కొందరి అజాగ్రత్తల కారణంగా ఎందుకు కోల్పోవాలనే సహానుభూతి బలంగా ఉన్న సమాజాల్లోనే అది జరుగుతుంది.
ఏ రాష్ట్ర శాసన సభలో కానీ, పార్లమెంట్ లో కానీ ఏ లెజిస్లేటరైనా ఈ ప్రశ్నలు లేవనెత్తారా?
NGOలేవైనా ఏ సమస్యని చర్చించాయా?
ఏ న్యాయవాదీ లేక ప్రజా హక్కుల పోరాటాలు చేసేవాళ్ళు ఇంతవరకూ P.I.L ఎందుకు వెయ్యలేదు?
Maybe I am wrong, but నా ఈ సందేహాలు నిజమేనా? లేకపొతే వీటికి సంబంధించిన న్యూస్, మీడియా కవరేజ్ కి నోచుకోవట్లేదా?
ఒరేయ్! బాలుడా! జాగ్రత్తరోయ్! బోర్ బావి చుట్టుపక్కలకెళ్ళే ముందు ……………..
****************************************************************
ఆలోచింపజేసేవిధంగా వ్రాశారండీ. వీలయితే బోరు ” భావి పౌరులు ” లేకుండా ఉండాలంటే !? పోస్టు చూసి మీ అభిప్రాయం చెప్పండి.
LikeLike
బావి అంటూ వుంటే దాని చుట్టూ పిట్టగోడ కట్టాలని తెలియదా?
అంత చిన్న పనికి కూడా డబ్బూ దస్కం తక్కువై పోయినాయా!
LikeLike
బోరు బావి లో ప్రమాద వశాత్తూ పడి , మరణిస్తున్న భావి పౌరులు ,నేటి చిన్నారుల మీద మీరు రాసిన టపా ఆలోచింప చేసేది గా ఉంది !
అత్యంత విషాదకరం గా మరణిస్తున్నఆ బాలలను రక్షించాలని , వారు ఆ బావులలో పడ్డాక , చేసే వివిధ రక్షక ప్రయత్నాలు, నివారణ ప్రయత్నాలూ , అత్యంత హాస్యాస్పదం గా ఉంటున్నాయి !
ఎందుకంటే , బోరు బావి వేసి నీళ్ళు పడకనో , లేదా నీళ్ళు పడ్డాక కానీ , ఆ బావులకు ఏ రకమైన రక్షక నిర్మాణాలనూ , మూతలనూ అమర్చకుండా , బాల బాలికలకే కాకుండా , జంతువులకు కూడా , ప్రాణాంతకం గా, మృత్యు కూపాలు గా మారుస్తున్న వారిని , ఇప్పటి వరకూ , ఏవిధమైన జరిమానా కానీ , శిక్ష కానీ వేయకుండా వదిలివేస్తున్నారు !అట్లాంటి వారి కి జరిమానా విధించే చట్టం తెస్తే , పోలీసులతో పాటుగా , రక్షణ లేని బోరు బావి గురించిన సమాచారం అందించిన వారికి కూడా , బహుమతి ప్రకటించాలి ! రక్షణ లేని బోరుబావుల ను సెల్ ఫోను తో ఫోటో లు తీసి ఆ ప్రాంత అధికారులకూ , రాజకీయ నాయకులకూ పంపాలి ! ప్రమాద నివారణకు , తల్లి దండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా ఏవీ కనబడట్లేదు !
అత్యంత సస్పెన్సు తో పాఠకులు కూడా, కేవలం రెండు మూడు రోజులు , ఆ వార్తను అనుసరిస్తున్నారే కానీ , వారు చేస్తున్నదీ , చేయగలిగేదీ కూడా ఏమీ ఉండట్లేదు !
చిన్నారుల ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతున్నా , బోరు వేసే వాడి గుండె కరగదన్నా !
LikeLike