నువ్వూ నేనూ ఒకటనుకుంటే చెప్పలేని దైర్యం , ఆపలేని ఆనందం
అనంతం నీ వైశాల్యం అగాధం నీ ఆంతర్యం
అద్భుతం నీ సౌందర్యం అల్లకల్లోలం నీ ఆనందం
అన్నీ నావే అన్నీ నేనే
అంతలో ఏదో భయం, నేను నువ్వు కాదనిపించే సంవిద్వైతం
అలగా ఎగయాలని ఆరాటం, ఎంత ఎగిసినా విరగకతప్పని దౌర్బల్యం
కట్ట దాటనీయని నీ బంధం, కట్టలు తెంచే అర్ధంకాని చైతన్యం
గుండె బాదుకున్నా చెదరని ఇసుక తిన్నెల నిశ్శబ్దం
ఉత్సాహం విరిచేస్తూ రాతిగుండెల్లో ఘనీభవించిన అహంకారం
నువ్వేనేననుకోనివ్వని అంతులేని నీ అంతర్మధనం
నీలోనే నా ఉనికనుకొమ్మనే జడప్రపంచపు అంధ నిబంధనం
నువ్వూ నేనూ ఒకటైనప్పుడు ఎందుకు నాకీ గతజల సేతుబంధనం
నేను నీది కాదనుకుంటే తప్పదుమరి నీ మనసున మధనం
ఎంత కాలమీ అరణ్య రోదనం ఎంత సేపు నీ ఆత్మ శోధనం
అయినా …
ఫరవాలేదు కూడగట్టుకుంటాను ధైర్యం
దుర్భరం నా మనసులోని దైన్యం
ప్రాణమివ్వమని సూర్యుణ్ణడుగుతా
ఊతమివ్వమని కొండగాలినడుగుతా
వానమబ్బునై ఆకాశంతో చేరిపోతా
అలనై ఆవిరినై మేఘాన్నై జలపాతాన్నై ఆకసమంతా ఆవరిస్తా
యేరునై సెలయేరునై చైతన్యపు తేరునై పుడమిపై నడయాడి వస్తా
నదినై పావన హృదినై జీవన కధనై నేను నేనై నీకై మళ్ళీ తిరిగివస్తా
మందమారుతాల మృదుత్వం
పిల్లతెమ్మెర సితారల సంగీతం
మేఘాన్నై నేనాస్వాదిస్తా
పర్వత సానువుల ఆత్మవిశ్వాసం
ఒంటరి శిఖరాగ్రాల ధైర్యం, స్థైర్యం
అందుకున్న నేఁ జలపాతాన్నై దూకేస్తా
లోయలోతుల్లోని భావగాంభీర్యం
అరణ్యాల, మైదానాల వైశాల్యం
గుండెల్లో నింపుకుని నీ చెంతకు ప్రవహిస్తా
నా ఒడిలో ఎదిగే జాతుల ఔన్నత్యం
నను త్రాగిన సంస్కృతుల సాహిత్యం
కలుపుకుని నీలో సంగమిస్తా
జననమరణావృత్తుల సాక్షినై పొందిన వైరాగ్యం
సృష్టిస్థితిలయాల కర్తగా ప్రాప్తించిన దివ్యత్వం
మోసుకుని స్థితప్రజ్ఞనై నీలో లయిస్తా
మన ఇద్దరి కలహం ఒక చైతన్యం
ఆద్యంతం అది అనంత ప్రణయం
నేనూ నువ్వని విభజించే ద్వైవిధభావం
నన్ను నేను తెలుసుకునే క్రమపరిణామం
నేనే నీవని, నీలోనే నేనని ఎరుగక తప్పని అద్వైతం
Once we dreamt that we were strangers.
We wake up to find that we were dear to each other
-Tagore (from Stray Birds)
4ksy
get news live updates @ http://www.indianewsbuzz.com/
LikeLike