హృదయాం’తరంగం’ – ౦౦౧ (Waves of Change)


అలలు అలలు అలలు అలలు,
మనసుకడలిలో ఎగిసే అంతులేని కలలు.
కలలు కలలు కలలు కలలు,
తలపులతీరం దాటని అలుపెరుగని అలలు
శిలలు శిలలు శిలలు శిలలు,
కలలఅలల హొయలనాపు అహంకారగిరులు
అలలు అలలు అలలుఅలలు ,
శిలలకు వెరవక పొంగే భావావేశపు ఝరులు
కలలు కలలు కలలు కలలు,
శిలలో శిల్పం చూసిన ద్రష్ట చేతి ఉలులు
శిలలు శిలలు శిలలు శిలలు,
అలలఉలుల మేల్కొల్పుకి ఉలికిపడే నిద్రాణపుకలలు

alalu kalalu silalau

 

శిలలు అహంకారానికి ప్రతీకలు – నిర్జీవ వస్తువులో అది జడత్వంగా కనబడితే మనిషిలో అది మార్పుని అర్ధం చేసుకోలేకపోవడం, మార్పుని అంగీకరించలేకపోవడం, మార్పు అవసరమైన చోట కూడా అది వద్దనుకోవడం … ఇలా మానిఫెస్ట్ అవుతుంది.

కలలు అంతరాత్మ కోరుకునే మార్పుకి  సంకేతాలు. ఏది పడితే అది కాదు, ఓ మంచి మార్పుకి – అంటే ఇప్పుడున్న స్థితి కంటే అందమైనది, ఉన్నతమైనది, కష్టం, దుఃఖం, హింసలని తగ్గించేది … ఇల్లాంటి మార్పుల్లో ఏదైనా కావచ్చు, మానసికం లేదా భౌతికం కావచ్చు. పాజిటివ్ దృక్పధం ఉన్న ఏ హృదయమైనా, మస్తిష్కమైనా ఇలాంటి మార్పుని కోరుకుంటుంది. ఆ మార్పు నిజమయ్యే వరకూ ఆ కోరిక కల గానే ఉంటుంది.

కల > Conception > క్రియేటివిటీ / సృజనాత్మకత > మార్పు

అలలు. కలల్ని నిజం చేసే ఆకాంక్ష, ప్రయత్నం, ప్రయాస, పట్టుదల…. వీటన్నిటికీ అలలు ప్రతీక.

కల కనేది, అలని కదిలించేది సమస్త సృష్టికి, దాని స్థితిలయాలకి కారణమైన ఆదిశక్తి. ఆ శక్తే స్థితి మార్పుని దర్శించి, ఆ మార్పుని సంకల్పించే, ఆవిష్కరించే ద్రష్ట.

ద్రష్ట అంటే ఋషి, కవి, రచయిత, కళాకారుడు(రిణి), తత్త్వవేత్త, శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త (కొండొకచో విప్లవకారుడు), వీళ్ళలో ఎవరైనా కావచ్చు. ద్రష్ట అనే నిర్వచనం మతమౌఢ్యం, తీవ్రవాదం ఉన్నచోట వర్తించదు. వాటికి దురహంకారమే సరైన నిర్వచనం.

ద్రష్ట ఆకాంక్షలు, ఆశయాలు, ఆదర్శాలు జనబాహుళ్యాన్ని మార్పు కోరుకునేలా ప్రభావితం చేసినప్పుడు వారిలో వచ్చిన చైతన్యం సంఘంలో కరుడుకట్టుకుపోయిన మూఢత్వం, హింసా ప్రవృత్తి, దురాశ, అవినీతి, మత దురహంకారం, అజ్ఞానం, మానసిక రుగ్మత, అధికార దాహం, …. ఏదైనా సరే, అది సమాజ శ్రేయస్సుని దెబ్బ తీసేంతగా PERVERT అయినప్పుడు …. దాన్ని సంస్కరిస్తుంది, లేదా నిర్మూలిస్తుంది.

సముద్ర తీరంలో ఉండే శిలలపై కెరటాలు చేసే యుద్ధం, కాలక్రమంలో శిలలు మెత్తటి ఇసుకగా మారిపోవడం , ఇవన్నీ చూస్తే ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక్కసారి మనసులో మెదులుతుంది. ఆ స్ఫురణ మామూలు మనిషిలో వ్యక్తిత్వ సంస్కరణకి దారి తీస్తే, మనీషిలో సంఘ సంస్కరణకి, సేవకి, త్యాగానికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

 

—These little thoughts are the rustle of leaves; they have their whisper of joy in my mind—